కేంద్రం పరిశీలనలో మెట్రో రైలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:12 AM
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది.
డబుల్ డెక్కర్ మోడల్ కొన్ని ప్రాంతాలకే పరిమితం?
రద్దీ కలిగిన ప్రాంతాల్లోనే రోడ్డు కనెక్టివిటీ
నివేదిక సమర్పించిన రైట్స్ సంస్థ
త్వరలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ విధానం పూర్తిస్థాయిలో అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. నగరంలో బాగా రద్దీగా ఉండే జంక్షన్లలో మాత్రమే డబుల్ డెక్కర్ నడిపి, మిగిలిన కారిడార్ అంతా మెట్రోరైలు మాత్రమే ఉండనుంది.
విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదించి పదేళ్లు దాటింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రాజెక్టు రూపురేఖలు మారిపోతున్నాయి. మొదట తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాధారణ మెట్రోరైలు ప్రాజెక్టును తొలుత కొమ్మాది వరకు, ఆ తరువాత భోగాపురం వరకు నిర్మించాలని టెండర్లు కూడా పిలిచారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు రుణాలు ఇవ్వడానికి ముందుకువచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మోనో రైలు అని, బీచ్‌లో రోడ్డులోనే రైలు నడుపుతామని ప్రతిపాదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘డబుల్ డెక్కర్’ విధానం అమలు చేస్తామని ప్రతిపాదించింది. ఇలా ప్రతిసారి ప్రతిపాదనలు మారడంతో కేంద్రం దీనిని నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది.
- రహదారులపై రద్దీని తగ్గించడానికి, మెట్రోరైలు ప్రాజెక్టును ఉపయోగిస్తున్నప్పుడు మళ్లీ అందులో డబుల్ డెక్కర్ పేరుతో కింద రహదారి, పైన రైలుపట్టాలు వేయడం తగదని ఆక్షేపించింది. డీపీఆర్ వెనక్కి ఇచ్చింది.
విశాఖ ప్రత్యేకత వేరు
విశాఖపట్నంలో జాతీయ రహదారి నగరం మధ్య నుంచే వెళుతోంది. భోగాపురం విమానాశ్రయానికి ఆ మార్గంలోనే వెళ్లాలి. నగరం అంతా మధురవాడ వైపు అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అథారిటీ నగరంలో ప్రధాన కూడళ్లలో రద్దీ నియంత్రణకు 12 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ముందుకువచ్చింది. ఇవి వైసీపీ హయాంలో మంజూరు కాగా కూటమి వచ్చిన తరువాత భూసేకరణ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్లు పక్కన పెట్టింది. నేషనల్ హైవే అథారిటీకి ఏకంగా మరో రోడ్డును డబుల్ డెక్కర్ విధానంలో వేయాలని సూచించింది. ఆ ప్రకారం కొత్త డీపీఆర్ తయారుచేసి కేంద్రానికి పంపారు. అందులో మెట్రో కారిడార్ 46.23 కి.మీ.గాను డబుల్ డెక్కర్ లైన్ 20 కి.మీ.గాను చూపించారు. దీనిపై మళ్లీ కేంద్రం అభ్యంతరం వ్యక్తంచేసింది. అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా రైట్స్ అనే సంస్థను కోరింది. రెండు నెలల క్రితమే ఆ సంస్థ నివేదిక సమర్పించింది. అందులో డబుల్ డెక్కర్ లైన్ 20 కి.మీ. పొడవు అవసరం లేదని, 13 కి.మీ. సరిపోతుందని సూచించింది. దానిని ఇప్పుడు కేంద్రం పరిశీలిస్తోంది. ఈసారి ఎటువంటి కొర్రీలు లేకుండా ఆమోదిస్తుందా? లేదా? అనేది అనుమానంగా ఉంది.
- మెట్రో రైలు ప్రాజెక్టు ఏ నగరానికి లాభదాయకం కాదని, కాకపోతే అభివృద్ధి చెందుతున్న నగరాలకు అది తప్పనిసరి ప్రాజెక్ట్ కాబట్టి విశాఖకు మంజూరుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
- మెట్రో రైలు పట్టాలకు సమాంతరంగా మళ్లీ రహదారి వేసి వాహనాలు నడపడం ఏమిటని కేంద్ర అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ అభ్యంతరం చెబుతోంది. వీరిలో ఎవరు వెనక్కి తగ్గుతారు? ఎవరి మాట నెగ్గుతుందో తెలియదు. ఎప్పటికి డీపీఆర్ ఆమోదం పొందుతుందో..అందులో ఏ మార్గం ఎంత పొడవు ఉంటుందో ప్రకటించే వరకు గ్యారంటీ కనిపించడం లేదు.
త్వరలోనే గ్రీన్‌సిగ్నల్
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రైట్స్ నివేదిక అర్బన్ ఎఫైర్స్ శాఖ వద్ద పరిశీలనలో ఉందని, త్వరలోనే ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు.