Share News

మెట్రో రైలు ప్రాజెక్టులో ఫ్లైఓవర్లు

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:41 AM

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారిపై స్టీల్‌ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు మొదటి దశలో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఫ్లైఓవర్లను కూడా అనుసంధానం (ఇంటిగ్రేషన్‌) చేయాలని నిర్ణయించారు. ఇది నగర ప్రజలకు ఊరట కలిగించే విషయం.

మెట్రో రైలు  ప్రాజెక్టులో ఫ్లైఓవర్లు

ఐదు ప్రాంతాల్లో కనెక్టివిటీ

గాజువాక, తాటిచెట్లపాలెం, మద్దిలపాలెం, హనుమంతవాక, కారుషెడ్‌ జంక్షన్ల ప్రాంతాలు పరిశీలన

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కంటే

నగర ప్రజల అవసరాలకే ప్రాధాన్యం

సీఎం సానుకూలం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారిపై స్టీల్‌ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు మొదటి దశలో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఫ్లైఓవర్లను కూడా అనుసంధానం (ఇంటిగ్రేషన్‌) చేయాలని నిర్ణయించారు. ఇది నగర ప్రజలకు ఊరట కలిగించే విషయం.

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) విశాఖపట్నం నగరం మధ్య నుంచి వెళ్లే జాతీయ రహదారి-16పై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి 12 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే జాతీయ రహదారిపై ఫ్లైఓవర్లు నిర్మించి, మరోవైపు మెట్రో రైలు ప్రాజెక్టు కూడా చేపడితే భూసేకరణ ఇబ్బంది అవుతుందని కూటమి ప్రభుత్వం ‘డబుల్‌ డెక్కర్‌ మోడల్‌’ను ప్రతిపాదించింది. ఇందులో ఫ్లైఓవర్లు ఉండవు. రెండు వరుసల్లో కిందన వాహనాలు వెళ్లేందుకు, పైన మెట్రో రైలు నడిపేందుకు ట్రాక్‌ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలో ప్రారంభం కాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేవారిలో అత్యధికులు ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉండడంతో ‘ఫ్లైఓవర్లు’ తప్పనిసరిగా ఉండాలని, వాటిని నిర్మించకపోతే ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువ అవుతాయని స్వయంగా ఎమ్మెల్యేలే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. నగర ప్రముఖులు, వ్యాపారులు, అసోసియేషన్ల ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయాన్ని వారంతా దఫదఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, పురపాలక శాఖ మంత్రి నారాయణల దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. ఫ్లైఓవర్లు లేకుండా మెట్రో రైలు ఒక్కటే ఏర్పాటు చేస్తే వ్యతిరేకత ఎక్కువ అవుతుందని గుర్తించి, వాటిని ప్రాజెక్టులో ఇంటిగ్రేట్‌ చేయాలని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం.

ఏమి చేస్తారంటే...?

లంకెలపాలెం నుంచి కొమ్మాది వరకు మొత్తం 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. వీటి సంఖ్యను అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎంఆర్‌సీఎల్‌) అధికారులు పదికి కుదించారు. స్టీల్‌ ప్లాంటు నుంచి మెట్రో రైలు ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడి నుంచే పరిగణనలోకి తీసుకున్నారు. డబుల్‌ డెక్కర్‌ విధానంలో కిందన వచ్చే మార్గంలో ఐదు జంక్షన్లలో వాహనాలు కిందికి దిగడానికి, అక్కడి నుంచి ఫ్లైఓవర్‌లా పైకి రావడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ విషయంలో భోగాపురం విమానాశ్రయానికి వెళ్లేవారు కాకుండా నగరంలో నిత్యం రాకపోకలు సాగించే ప్రజల అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు ఏఎంఆర్‌సీఎల్‌ ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తొలుత డబుల్‌ డెక్కర్‌ విఽధానంలో కిందన నిర్మించే మార్గంలో ఎక్కడా కనెక్టివిటీ లేకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి అంటే స్టీల్‌ ప్లాంటు నుంచి కొమ్మాదికి వెళ్లిపోయేలా ప్లాన్‌ చేశామని, అయితే ఇప్పుడు అలా కాకుండా మధ్యలో కీలకమైన ఐదు ప్రాంతాల్లో కిందకు దిగడానికి, అక్కడి వారు పైకి రావడానికి రెండు వైపులా యాక్సెస్‌ ఇస్తామని తెలిపారు. గాజువాక, తాటిచెట్లపాలెం, మద్దిలపాలెం, హనుమంతవాక, ఎండాడ, కారుషెడ్‌ జంక్షన్ల వద్ద ఈ కనెక్టివిటీ రావచ్చునని తెలిపారు. అయితే మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటే ఇవన్నీ నిర్మాణం జరిగే అవకాశం ఉన్నందున, అది పూర్తయ్యేవరకు నగర ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది.

Updated Date - Mar 10 , 2026 | 12:41 AM