Share News

స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజకు పక్కాగా ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:29 AM

ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని, అందువల్ల పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా అధికారులను కోరారు.

స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజకు పక్కాగా ఏర్పాట్లు

మంత్రులు కొల్లు రవీంద్ర, అనిత ఆదేశాలు

కలెక్టర్‌, ఎస్పీ, జేసీలతో సమీక్ష

జనసమీకరణ, రవాణా సదుపాయాలపై కూటమి నేతలతో సమావేశం

నక్కపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):

ఆర్సెలార్‌ మిట్టల్‌-నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని, అందువల్ల పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం హోం మంత్రి నివాసంలో కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, పలువురు అధికారులతో సమావేశం నిర్వహించి స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ ఏర్పాట్లపై చర్చించారు. సభావేదిక నిర్మాణం, హెలీప్యాడ్‌, వాహనాల పార్కింగ్‌, పోలీసు బందోబస్తు గురించి ఎస్పీ వివరించారు. అనంతరం మంత్రులు కూటమి నేతలతో సమావేశమయ్యారు. జనసమీకరణ, సభకు వచ్చే ప్రజలకు ఆహారం, రవాణా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని, దీనిపై ప్రజలకు విస్తతృ అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, కార్పొరేషన్ల చైర్మన్లు మళ్ల సురేంద్ర, పీజీవీ కుమార్‌, బాలాజీ, నియోజకవర్గం నేతలు పాల్గొన్నారు. అనంతరం స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, తదితరులు పరిశీలించి, పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ, ఇక్కడ ఏర్పాటు కానున్న స్టీల్‌ ప్లాంట్‌ జిల్లాకే తలమానికంగా వుంటుందని, అందువల్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా పలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు. రానున్న మూడేళ్లలో జిల్లా రూపురేఖలు మారిపోతాయని చెప్పారు.


హోం మంత్రి అనిత

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

నక్కపల్లి, మార్చి16 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులపాటు కఠోర ఉపవాస దీక్ష చేపట్టి, ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఇక్కడ మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు స్ఫూర్తి, ప్రాణత్యాగం తెలుగుజాతికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులతోపాటు కూటమి నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్‌, బోడపాటి శివదత్‌, వెంకటేశ్వరరావు, దేవర సత్యనారాయణ, కురందాసు నూకరాజు, చించలపు ప్రదీప్‌, గింజాల లక్ష్మణరావు, అమలకంటి అబద్దం, కొప్పిశెట్టి బుజ్జి, వైబోయిన రమణ, గోసల తాతారావు, అల్లు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.


వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర

అనకాపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి మండలం వెంకుపాలెంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘రైతన్న- మీకోసం’ ఆయన మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకాల కింద ఈ ఏడాది మూడో విడతగా జిల్లా రైతులకు రూ.132 కోట్లు అందజేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతు సంక్షేమం కోసం రూ.53 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. పంటలకు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ విధానాన్ని పాటించాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. వచ్చే ఏడాదికి పోలవరం ఎడమ కాలువ ద్వారా జిల్లాకు గోదావరి జలాలు వస్తాయని తెలిపారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ, వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖల సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి ఆధునిక సాగు పద్ధతులు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వచ్చే పంటల గురించి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి, కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కోట్ని బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 01:29 AM