Share News

పకడ్బందీగా జన సమీకరణ ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:10 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి చేపట్టే జన సమీకరణ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు.

పకడ్బందీగా జన సమీకరణ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, డీఆర్‌వో లోకేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి

భోగాపురం విమానాశ్రయ ప్రారంభ కార్యక్రమానికి తరలించే క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరి

అధికారులకు కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పాడేరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి చేపట్టే జన సమీకరణ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. ఆగస్టు ఒకటిన ప్రధాని మోదీ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి జిల్లా నుంచి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా నుంచి జన సమీకరణకు సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ తిరుమాని శ్రీపూజ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ప్రజల తరలింపు నేపథ్యంలో వారి భద్రత, రవాణా, సదుపాయాల విషయంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. అలాగే ఘాట్‌ మార్గాల్లో బస్సుల రాకపోకలు, భద్రత, ట్రాఫిక్‌ వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రతి బస్సులోనూ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని, మందులు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి అప్పగించిన పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో ఎవరికి ఎటువంటి అవసరాలు, సలహాలు, సూచనలు, సమస్యలున్నా పరిష్కరించేందుకు ఆర్‌డీవో భుజంగరావు ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 9281856953ను ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ముగ్గురు ఎంపీడీవోల జీతాలు నిలుపుదల

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న జిల్లాలోని ముగ్గురు ఎంపీడీవోల జీతాలను నిలుపుదల చేయాలని జిల్లా ఖజానాధికారి అనిల్‌కుమార్‌ను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జిల్లాలో అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి ఎంపీడీవోలు విధుల పట్ల అలక్ష్యంగా ఉంటున్నారని, ఇదే కొనసాగితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతానికి వారి జీతాలను నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:10 AM