ఎంఈవోల చేతివాటం!
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:34 AM
జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరఫరాచేసే కిట్ల రవాణా సొమ్ము ప్రధానోపాధ్యాయులకు అందజేయడంలో కొందరు మండల విద్యాశాఖాధికారులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వినిస్తున్నాయి.
హెచ్‌ఎంలకు చెల్లించని విద్యార్థి కిట్ల రవాణా సొమ్ము
జిల్లాలో గత రెండేళ్లుగా ఇదే వ్యవహారం
విచారణకు ఆదేశించిన విద్యాశాఖ అధికారులు
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరఫరాచేసే కిట్ల రవాణా సొమ్ము ప్రధానోపాధ్యాయులకు అందజేయడంలో కొందరు మండల విద్యాశాఖాధికారులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వినిస్తున్నాయి. రెండేళ్ల సొమ్మును స్వాహాచేశారన్న విషయం వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే (జూన్ మూడోవారం) సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి ఎంఈవోల ఖాతాలకు రవాణా సొమ్ము జమయింది. ఇప్పటివరకు హెచ్‌ఎంలకు పంపిణీ చేయలేదు. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు.
జిల్లాలోని 593 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాగు, పుస్తకాలు, బెల్టు, బూట్లతో కూడిన కిట్లు విజయవాడ నుంచి ఎంఈవో కార్యాలయాలకు చేరాయి. అక్కడి నుంచి మండలంలో అన్ని పాఠశాలలకు సరఫరాచేయడానికి కిట్టుకు రవాణా ఖర్చులు రూ.11.18, అలవెన్సు రూ.6.20, ప్యాకింగ్ చార్జీలు రూ.3 చొప్పున జిల్లాకు రూ.14.11 లక్షలను సమగ్రశిక్ష ఖాతాకు ప్రభుత్వం జమచేసింది. అధికారులు ఎంఈవో ఖాతాలకు బదిలీ చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో కొందరు ఎంఈవోలు రవాణా ఆపరేటర్లతో మాట్లాడుకుని కిట్లు పాఠశాలలకు చేరవేశారు. ఆపరేటర్లకు ఎంఈవోలే సొమ్ము చెల్లించారు. మరికొన్ని మండలాల్లో హెచ్‌ఎంలే ఆటోలు, వ్యాన్‌లలో కిట్లు తీసుకువెళ్లారు. ఖర్చును వారే భరించారు. మరికొన్ని మండలాల్లో వాహనాల ద్వారా కిట్లు పంపించి, పాఠశాల హెచ్‌ఎంల నుంచి చార్జీలు వసూలు చేశారు.
నాలుగు నెలలు గడిచినా కొందరు ఎంఈవోలు హెచ్‌ఎంలకు రవాణా ఖర్చులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో గాజువాక ఎంఈవోపై సమగ్రశిక్ష ఏపీసీ చంద్రశేఖరరావుకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఫిర్యాదుచేసింది. దీంతో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు స్పందించి డీఈవో, ఏపీసీ నుంచి వివరాలు తీసుకున్నారు. ఇదిలావుండగా కొన్ని మండలాల ఎంఈవోలు రవాణా ఖర్చుల్లో సగం హెచ్‌ఎంలకు ఇచ్చి సరిపెట్టేశారని సమాచారం. ఈ నిర్వాకం తెలిసినా విద్యాశాఖాధికారులు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. దీనిని సమగ్రశిక్ష ఏపీసీ డా.జె.చంద్రశేఖరరావు వద్ద ప్రస్తావించగా ఎంఈవోల నుంచి నివేదిక కోరామన్నారు. జూన్ మూడోవారంలోనే ఎంఈవోల ఖాతాకు సొమ్ము జమ చేశామని, ఇప్పటివరకు చెల్లించకపోవడంపై సమాచారం తీసుకుంటామన్నారు.