ఏసీబీ వలలో పాడేరు ఎంఈవో
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:33 PM
పాడేరు మండల విద్యాశాఖాధికారి మోరి జాన్ లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడ్డారు.
విశ్రాంత ఉపాధ్యాయుడి పెన్షన్ ప్రతిపాదనలకు రూ.40 వేలు డిమాండ్
బాధితుడి ఫిర్యాదుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
ప్రతీ పనికి డబ్బులు తీసుకుంటారని ఎంఈవోపై ఆరోపణలు
టీచర్ల సర్వీసు రిజిస్టర్ అప్‌డేట్ మొదలు పెన్షన్ ప్రతిపాదన వరకు అన్నింటికీ చేతులు తడపాల్సిందేనని విమర్శలు
పాడేరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పాడేరు మండల విద్యాశాఖాధికారి మోరి జాన్ లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్‌పీ బీవీవీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పి.శ్రీరాములు అనే ఉపాధ్యాయుడు గత ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేశారు. ఆయనకు సంబంధించిన పెన్షన్ ప్రతిపాదనలు, ఇతర ఆర్థికపరమైన ప్రయోజనాలకు సంబంధించి వ్యవహారాలను పూర్తి చేసి విజయవాడ ఆడిట్ జనరల్ కార్యాలయానికి పంపేందుకు ఎంఈవో మోరి జాన్ రూ.40 వేలు డిమాండ్ చేశారు. ఎంఈవోకు లంచం ఇచ్చేందుకు ఇష్టపడని విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరాములు...ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం శ్రీరాములు నుంచి ఎంఈవో మోరి జాన్ తన కార్యాలయంలోనే రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎంఈవోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలో, ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆయన్ను అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు సీహెచ్ లక్ష్మణమూర్తి, శ్రీనివాసరావు, సుప్రియ, వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతీ పనికి పైసలే!
ప్రతీ పనికి స్థానిక మండల విద్యాశాఖాధికారి మోరి జాన్ డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. విశ్రాంత ఉపాధ్యాయుడి పెన్షన్ ప్రతిపాదనలు, ఇతర ఆర్థిక పరమైన ప్రయోజనాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసేందుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన గత ఐదు నెలలుగా అవినీతి, ఆర్భాట వ్యవహారాలను సాగించారని ఉపాధ్యాయులు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.
ఒక వైపు లంచాలు... మరో వైపు సన్మానాలు
స్థానిక మండల విద్యాశాఖాధికారిగా గతేడాది ఆగస్టులో బాధ్యతలు స్వీకరించిన మోరి జాన్ ఒక వైపు ఉపాధ్యాయుల పనులకు లంచాలు తీసుకోవడంతోపాటు తనకు ప్రతి పాఠశాలలోనూ సన్మానం చేయాలని డిమాండ్ చేశారనే ఆరోపణలున్నాయి. టీచర్లకు సంబంధించిన సర్వీసు రిజిస్టర్ అప్‌డేట్ చే యడం మొదలు ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిపై, విశ్రాంత టీచర్ల పెన్షన్ ప్రతిపాదనలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల ఫైళ్లపై సంతకాలు చేసేందుకు డబ్బులు గుంజేవారని అంటున్నారు. అయితే ఆయన స్థానికుడు కావడంతో పాటు పైరవీలు సాగించి ఇక్కడ ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన్ని వ్యతిరేకించేందుకు టీచర్లు సాహసించలేకపోయారని చెబుతున్నారు. అయితే ఎట్టకేలకు పాపం పండడంతో ఏసీబీకి చిక్కారని పలువురు టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విసుగు చెంది ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
మండలంలో డి.గొందూరు ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు గతేడాది జూన్ 30న పదవీ విరమణ చేశారు. దీంతో ఆయనకు సంబంధించిన పెన్షన్ ప్రతిపాదనలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసి విజయవాడ ఆడిట్ జనరల్ కార్యాలయానికి పంపాలని ఎంఈవో జాన్‌ను కోరితే అందుకు రూ.40 వేలు డిమాండ్ చేశారు. అయితే రూ.10వేలు వరకు ఇస్తానని విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రాధేయపడినప్పటికీ ఆయన అంగీకరించకపోవడంతో విసుగు చెందిన బాధితుడు ఏసీబీని ఆశ్ర యించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని లంచం తీసుకుంటుండగా గురువారం ఎంఈవో జాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అయితే వాస్తవానికి స్థానిక ఎంఈవో రూ.40 వేలు అధిక మొత్తంలో డిమాండ్ చేయడం వల్లే బాఽధితుడు శ్రీరాములు ఏసీబీని ఆశ్రయించారని, ఏజెన్సీలో అనేక మండలాల్లో మండల విద్యాశాఖ కార్యాలయాల్లో టీచర్లకు సంబంధించిన పనులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పైరవీలతోనే పాడేరు ఎంఈవోగా బాధ్యతలు
అరకులోయలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న మోరి జాన్ పైరవీలు సాగించి గతేడాది ఆగస్టు నెలలో పాడేరు మండల విద్యాశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారని పలువురు చెబుతున్నారు. అయితే స్థానిక ఎంఈవో పోస్టును పక్క మండలాలైన హుకుంపేట లేదా జి.మాడుగులకు చెందిన హైస్కూల్ హెచ్‌ఎంలకు అప్పగించాలని విద్యాఖాధికారులు భావించినప్పటికీ జాన్ తనదైన శైలిలో పైరవీలు సాగించి స్థానిక ఎంఈవోగా బాధ్యతలు స్వీకరించారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఎంఈవో పోస్టుకు ఖర్చు చేసిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము సంపాదించాలనే ఆశతోనే ఆయన బహిరంగంగా లంచాలకు పాల్పడ్డాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.