Share News

మేహాద్రిగెడ్డ గేట్లు శిథిలం

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:20 AM

సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు మొత్తం మార్చాల్సిందేనని జల వనరుల శాఖ నిపుణులు తేల్చారు.

మేహాద్రిగెడ్డ గేట్లు శిథిలం

ఆరూ మార్చాల్సిందే...

రోలర్లు కూడా...

రిజర్వాయర్‌ గేట్లు పరిశీలించిన నిపుణుల బృందం

రూ.ఆరేడు కోట్లు అవసరం

విశాఖపట్నం/గోపాలపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):

సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు మొత్తం మార్చాల్సిందేనని జల వనరుల శాఖ నిపుణులు తేల్చారు. జల వనరుల శాఖ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ విభాగం ఈఈ విజయసారథి, జలవనరుల శాఖ కన్సల్టెంట్‌ కేవీ కృష్ణారావు, జిల్లాకు చెందిన అధికారులు కలిసి గురువారం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు పరిశీలించారు. ఈ రిజర్వాయర్‌ను 1980కు ముందు నిర్మించారు. ఆ సమయంలో ఆరు గేట్లు ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ గేట్లు మార్చలేదు. కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. మధ్యలో ఒకటి, రెండుసార్లు గేట్ల షట్టర్లకు గ్రీజు మాత్రమే పెట్టారు. దశాబ్లాలుగా గేట్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఆరింటిలో ఒకటి, ఐదో గేట్లు చాలాకాలం క్రితమే మొరాయించాయి. రోలర్ల ద్వారా ఈ రెండు గేట్లు పైకి లేచే పరిస్థితి లేదు. నిధుల సమస్య కారణంగా ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పాటు వాయిదా వేస్తూ వస్తున్నారు. రిజర్వాయర్‌ క్యాచ్‌మెంట్‌లో భారీవర్షాలు కురిస్తే మొత్తం ఆరు గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. లేనిపక్షంలో పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ గేట్లు కొట్టుకుపోతే ఎయిర్‌పోర్టు, పోర్టు, హెచ్‌పీసీఎల్‌తో పాటు పలు కాలనీల్లో నీరు ప్రవేశించే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రెండు గేట్లు మార్చేందుకు రూ.5.75 కోట్లతో అంచనాలు రూపొందించారు. అందుకు అవసరమైన నిధులు జీవీఎంసీ నుంచి విడుదల చేస్తామని గత కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో జల వనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. నూజివీడులోని మెకానికల్‌ విభాగం అధికారులు అన్నీ పరిశీలించి రూ.5.3 కోట్లకు సాంకేతిక ఆమోదం తెలిపారు. అయితే గేట్ల తాజా పరిస్థితిపై సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్స్‌ నిపుణుల సలహా తీసుకోవాలని చెప్పడంతో విజయసారథి, కేవీ కృష్ణారావుతో కూడిన బృందం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లను తనిఖీచేసింది. ఒకటి, ఐదు మాత్రమే కాకుండా అన్ని గేట్లు మార్చాలని కమిటీ సూచించింది. అదేవిధంగా అప్పట్లో ఏర్పాటుచేసిన రోలర్లకు కూడా ఇప్పటివరకూ మరమ్మతులు చేయలేదని నిపుణులు గుర్తించారు. దీంతో రోలర్లు ఏ క్షణానైనా మొరాయించే అవకాశం ఉందని, ఆరు గేట్లతో పాటు రోలర్లు, స్టాప్‌ లాగ్‌ (గేట్లు పైకి ఎత్తడం, కిందకు దించే వ్యవస్థ) మార్చాలని, ఇందుకు ఆరేడు కోట్ల రూపాయలు అవసరమవుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందుకు కనీసం ఆరేడు నెలల సమయం పడుతుందని కన్సల్టెంట్‌ కేవీ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. రోలర్లు, గేట్లు కొత్తవి తయారుచేయాల్సి ఉందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారని వివరించారు.

Updated Date - Jul 11 , 2026 | 12:20 AM