నేడు మెగా పీటీఎం-4.0
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:43 AM
జిల్లాలోని ప్రభుత్వ/ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (మెగా పీటీఎం 4.0) ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులంతా హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా విద్యా సంస్థల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలు, కళాశాలల్లో ఏర్పాట్లు
అనకాపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ/ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (మెగా పీటీఎం 4.0) ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులంతా హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా విద్యా సంస్థల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు. మెగా పీటీఎం 4.0 నిర్వహణ కోసం ఆయా విద్యా సంస్థల హెచ్‌ఎంలు/ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు/ అధ్యాపకులు, విద్యా కమిటీలు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి, మెగా పీటీఎంకు హాజరుకావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను స్వయంగా ఆహ్వానించారు. విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొనేలా సమన్వయం చేశారు.
మెగా పీటీఎంలో ప్రతి విద్యార్థి చదువులో ప్రగతి, హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టులు, ఆరోగ్య కార్డులను తల్లిదండ్రులకు అందజేసి వాటిపై ఉపాధ్యాయులు లోతుగా చర్చిస్తారు. విద్యార్థుల్లో మెరుగుపర్చాల్సిన అంశాలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలపై అభిప్రాయలను సేకరిస్తారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. మెగా పీటీఎంకు హాజరయ్యే వారందరికీ పాఠశాల/ కళాశాలలోనే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మెగా పీటీఎం విజయవంతం కావడానికి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.