ఏకీకృత కుటుంబ సర్వేపై నేడు సభలు
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:29 AM
రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) డేటా సామాజిక తనిఖీ ధ్రువీకరణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని స్వర్ణ పంచాయతీలు, స్వర్ణ వార్డుల్లో శుక్రవారం ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి సర్వే వివరాలపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. కుటుంబ సర్వే జాబితాలను ఇప్పటికే స్వర్ణ పంచాయతీలు/ వార్డుల్లో ప్రదర్శించారు.
స్వర్ణ గ్రామ/ వార్డు కార్యాలయాల్లో జాబితాలు
జిల్లాలో 5,84,986 కుటుంబాలు గుర్తింపు
పొరపాట్లు, అభ్యంతరాలపై ఆధారాలతో ఫిర్యాదు
విచారణ జరిపి.. వెంటనే సవరణలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) డేటా సామాజిక తనిఖీ ధ్రువీకరణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని స్వర్ణ పంచాయతీలు, స్వర్ణ వార్డుల్లో శుక్రవారం ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి సర్వే వివరాలపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. కుటుంబ సర్వే జాబితాలను ఇప్పటికే స్వర్ణ పంచాయతీలు/ వార్డుల్లో ప్రదర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వం కుటుంబ వివరాలను అస్తవ్యస్తంగా నమోదు చేసింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అనేక మంది అనర్హులకు అందుతున్నాయి. మరోవైపు అర్హులకు సంక్షేమ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం యూఎఫ్‌ఎస్ సర్వే ద్వారా ప్రతి కుటుంబం, పౌరుడి సమగ్ర సమాచారాన్ని సేకరించే ప్రక్రియను పూర్తి చేసింది. ఈ వివరాల ఆధారంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 5,84,986 కుటుంబాలను గుర్తించి వారి వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక వివరాలను నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు నుంచి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో కుటుంబం, విద్య, ఉద్యోగం, ఆదాయం, నివాసం గృహం, వాహనాలు, గృహోపకరణాలు, ఆధార్, రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, కుల ధ్రువీకరణ తదితర వివరాలను నమోదు చేశారు. ఈ జాబితాలను ఇప్పటికే సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించారు. ప్రజలు వీటిని పరిశీలించి తప్పులు ఉంటే గుర్తించాలని అధికారులు సూచించారు. జిల్లాలోని అన్ని స్వర్ణ పంచాయతీలు, స్వర్ణ వార్డుల్లో శుక్రవారం ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి సర్వే వివరాలపై సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు..
అభ్యంతరాల స్వీకరణ
జాబితాలో పేరు, కులం లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు వున్నట్టయితే స్వర్ణ గ్రామ లేదా స్వర్ణ వార్డు సభలో తెలియజేయవచ్చు. ఈనెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సంబంధిత డేటా అసిస్టెంట్‌లు (డీఏలు), వార్డు డిజిటల్ ప్రొఫెషనల్ సెక్రెటరీల (డబ్ల్యూడీపీఎస్) వద్ద అవసరమైన ఆధారాలతో ఫిర్యాదులు నమోదు చేసుకొనే అవకాశం కల్పించారు. అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి వెంటనే సవరణలు చేపడతారు. కుల ధ్రువీకరణకు సంబంధించిన అంశాలను గ్రామ రెవెన్యూ అధికారులు ఈ నెల 27వ తేదీలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు సంబంధించిన తప్పులను పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీలు ఈ నెల 26వ తేదీలోగా సరిదిద్దుతారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించడానికి, అర్హుల గుర్తింపులో కచ్చితత్వం కోసం చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రజలందరూ తప్పనిసరిగా పాల్గొని సహకరించాలని జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల అధికారి బీవీ సత్యనారాయణ కోరారు.