Share News

ప్రజల చెంతకే వైద్యం

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:47 PM

జిల్లాలో గిరిజనుల ముంగిటకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రత్యేకంగా ఒక మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను మంజూరు చేసింది.

ప్రజల చెంతకే వైద్యం
మొబైల్‌ వ్యాన్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

జిల్లాకు ‘మీ ఇంటికి - మీ డాక్టర్‌’ ప్రాజెక్టును మంజూరు చేసిన రెడ్‌క్రాస్‌ సొసైటీ

ఒక డాక్టర్‌, సిబ్బందితో ప్రత్యేకంగా రూ.1.2 కోట్లతో మొబైల్‌ యూనిట్‌ ఏర్పాటు

మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్య సేవలు

ఈ ప్రాజెక్టుతో గిరిజనులకు ఎంతో మేలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గిరిజనుల ముంగిటకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రత్యేకంగా ఒక మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను మంజూరు చేసింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో మాతాశిశు మరణాలను అరికట్టాలనే లక్ష్యంతో రూ.1.2 కోట్ల వ్యయంతో రెడ్‌క్రాస్‌ సొసైటీ ‘మీ ఇంటికి- మీ డాక్టర్‌’’ పేరిట ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, నంద్యాల, పార్వతీపురం మన్యం, తిరుపతి, పల్నాడు, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలకు ఈ ప్రాజెక్టులను మంజూరు చేశారు.

ప్రత్యేకంగా మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌

‘మీ ఇంటికి- మీ డాక్టర్‌’ పేరిట ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేకంగా ఒక మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక వైద్యుడు, ఫార్మసిస్టు, నర్సు, పైలట్‌ ఉంటారు. ఈ యూనిట్‌కు కేటాయించిన గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో పాటు క్షయ, డెంగ్యూ, మలేరియా వంటి వాటికి వైద్య సేవలు అందిస్తారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అవసరమైన చికిత్సలు, వైద్య సేవలు సైతం మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా అందిస్తారు. ఇందులో డాక్టర్‌, వైద్య సిబ్బంది, మందులు ఉండడంతో అక్కడిక్కడే అవసరమైన వైద్య సేవలు అందిస్తారు.

గిరిజన ప్రాంతాలకు ఎంతో మేలు

ఎటువంటి ప్రైవేటు వైద్య సేవలు లేని గిరిజన ప్రాంతంలో శత శాతం ప్రభుత్వ వైద్యంపైనే రోగులు ఆధారపడతారు. ఈ తరుణంలో గిరిజన పల్లెల్లోని ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించే మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లను ఏర్పాటు చేయడంతో గిరిజన రోగులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు ఇళ్లకే పరిమితమవుతారు. అలాగే అనారోగ్యంతో ఉన్న తమ చిన్నారులను ఇంటి వద్దే ఉంచేస్తారు. ఇక వృద్ధుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా ఇంటింటికీ వైద్య సేవలు అందించడంతో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.

మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ వ్యాన్‌ ప్రారంభం

గిరిజన పల్లెల్లో ఇంటింటికీ వైద్య సేవలందించేందుకు రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏర్పాటు చేసిన మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌ ఆవరణలో గురువారం ఆయన మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ వ్యాన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రత్యేకంగా మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను మంజూరు చేసిందన్నారు. ఇందులో డాక్టర్‌, సిబ్బంది ఉంటారని, గిరిజనుల ఇంటింటికీ వెళ్లి అవసరమైన వైద్య సేవలు అందిస్తారన్నారు. అలాగే మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ సేవలతో మాతాశిశు మరణాలు తగ్గుముఖం పడతాయని కలెక్టర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్‌, డీఆర్‌వో అంబేడ్కర్‌, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు బొర్రా నాగరాజు, ఎస్‌.గంగరాజు, జి.గౌరిశంకర్‌, జి.సుబ్రహ్మణ్యం, పి.సూర్యారావు, డి.రవి, జయలక్ష్మి, ప్రసాద్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:47 PM