వికటించిన వైద్యం
ABN , Publish Date - Jun 21 , 2026 | 10:52 PM
మండలంలో ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.
ఒకే ఇంట్లో ఇద్దరు మృతి
నాలుగు రోజుల నుంచి చిన్నారులకు పచ్చకామెర్లు, జ్వరం
స్థానిక ఆర్‌ఎంపీని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
హెవీ డోస్ మందు ఇవ్వడంతో మృత్యువాత
పెదబయలు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పెదబయలు మండలంలోని మారుమూల కుంతుర్ల పంచాయతీ బొడ్డగొంది గ్రామానికి చెందిన అనుగూరి కోటేశ్వరరావుకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె మేరి(9) గోమంగి మినీ గోకులంలో మూడవ తరగతి చదువుతోంది. కుమారుడు జీవన్‌రాజ్(7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం మేరి, జీవన్‌రాజ్ జ్వరం, పచ్చకామెర్ల బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు పచ్చకామెర్లు తగ్గడానికి శుక్రవారం పసరు మందు వేశారు. అయినా తగ్గకపోవడంతో శనివారం గ్రామానికి వచ్చిన ఆర్‌ఎంపీ ద్వారా చికిత్స అందించారు. ఆర్‌ఎంపీ ఇచ్చిన హెవీ డోస్ మందులు, ఇంజక్షన్ల వల్ల శనివారం రాత్రి 10 గంటల సమయంలో మేరి మృతి చెందింది. ఆ కుటుంబం బాధలో ఉండగా ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో జీవన్‌రాజ్ కూడా మృతి చెందాడు. తన నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు చనిపోయారని తండ్రి కోటేశ్వరరావు విలపించాడు. కాగా కోటేశ్వరరావుతో పాటు మరో కుమారుడు మోసేకు కూడా జ్వరం ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న పెదబయలు పీహెచ్‌సీ వైద్యుడు నిఖిల్ బృందం గ్రామానికి వచ్చి వారిని పరీక్షించి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పసర మందు, ఆర్‌ఎంపీ వైద్యం కారణంగానే ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందారని డాక్టర్ నిఖిల్ నిర్ధారించారు.