Share News

20 వేల మందికి డ్రోన్‌ ద్వారా వైద్య సేవలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 10:58 PM

జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్‌ను వినియోగించి 20 వేల మంది రోగులకు వైద్య సేవలను అందించామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

20 వేల మందికి డ్రోన్‌ ద్వారా వైద్య సేవలు
జిల్లాలో వైద్య సేవలకు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న మెడికల్‌ డ్రోన్‌

కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన జిల్లా కలెక్టర్‌ నిషాంతి

భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల సేవలు అనుసంధానిస్తాం

కలెక్టర్‌ను అభినందించిన సీఎం చంద్రబాబునాయుడు

పాడేరు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్‌ను వినియోగించి 20 వేల మంది రోగులకు వైద్య సేవలను అందించామని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సదస్సు రెండో రోజు శుక్రవారం ఆమె మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో సాంకేతికతను వినియోగించి, ఉత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో డ్రోన్‌ సేవలను గత ఆరు నెలలుగా ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామన్నారు. ‘ప్రాజెక్ట్‌ డ్రోన్‌’ పేరుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అత్యవసర మందులు, రక్తం ప్యాకెట్లు, రక్త పరీక్షల నమూనాలను సమర్థవంతంగా రవాణా చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో అత్యంత క్లిష్టమైన భౌగళిక పరిస్థితుల్లో సైతం జిల్లా ఆస్పత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అత్యవసరమైన మందులు రవాణా చేస్తున్నామన్నారు. ఇలా ఇప్పటివరకు 1800 మార్లు డ్రోన్‌ సేవలను వినియోగించి, 72 వేల కిలోమీటర్లు డ్రోన్‌ రాకపోకలు సాగించి, 83 వేల మందులు, 9,500 పరీక్షల నమూనాల రవాణా జరిగిందని, ఫలితంగా 20 వేల మంది రోగులకు డ్రోన్‌ సేవలు ద్వారా ప్రయోజనం కలిగిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. దీంతో జిల్లాలో మాతా, శిశు మరణాలు సైతం తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో డ్రోన్‌ సేవలను 8 పీహెచ్‌సీల్లో నిర్వహిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 29న వాటిని 18 పీహెచ్‌సీలకు పెంచారని కలెక్టర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని డ్రోన్లతో జిల్లా వ్యాప్తంగా ఆయా సేవలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ నిషాంతి వివరించారు. డ్రోన్‌ వినియోగంపై రూపొందించి వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. దీంతో స్పందించిన సీఎం చంద్రబాబునాయుడు ప్రతికూల పరిస్థితులుండే గిరిజన ప్రాంతంలో అత్యవసర వైద్య సేవలకు డ్రోన్‌ వినియోగం బాగుందని, కలెక్టర్‌ టి.నిషాంతిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ నమూనాను ఇతర జిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయి అధికారులకు సూచించారు.

Updated Date - Sep 11 , 2026 | 10:58 PM