సీసీబీలో వైద్యసేవలు ప్రారంభం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:18 AM
స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి అనుబంధంగా 50 పడకలతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) సేవలను సోమవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ పూజలు చేసి ప్రారంభించారు.
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి అనుబంధంగా 50 పడకలతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) సేవలను సోమవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ బ్లాక్‌లో తొలి దశలో అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రస్తుతానికి క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డులను సిద్ధం చేశామన్నారు. కేంద్రం నుంచి అవసరమైన వైద్య పరికరాలు అందిన అనంతరం పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అత్యవసర వైద్యసేవల కోసం విశాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అనకాపల్లిలోనే మెరుగైన చికిత్స అందించడానికి క్రిటికల్ కేర్ బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. త్వరలో ఆక్సిజన్ యూనిట్ కూడా ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.