రైల్వేస్టేషన్‌లో మెడికల్ సెంటర్
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:18 AM
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఎమర్జన్సీ మెడికల్ సెంటర్‌ను డీఆర్‌ఎం లలిత్ బొహ్రా బుధవారం ప్రారంభించారు.
24/7 వైద్య సేవలు
డీఆర్‌ఎం లలిత్ బొహ్రా
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఎమర్జన్సీ మెడికల్ సెంటర్‌ను డీఆర్‌ఎం లలిత్ బొహ్రా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం స్టేషన్ నుంచి రోజూ 80 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారని, వారిలో చాలామందికి అత్యవసర వైద్యం అవసరం పడుతున్నదని, అందుకే పినాకిల్ ఆస్పత్రితో ఒప్పందం చేసుకుని ఒకటో నంబరు ప్లాట్‌ఫారంపై ఈ అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇది రౌండ్ ది క్లాక్ అంటే 24 గంటలూ పనిచేస్తుంది. ఒక డాక్టర్, ఒక ఫార్మసిస్ట్, ఒక సహాయకుడు విధుల్లో ఉంటారన్నారు. ప్రాథమిక వైద్యంతో పాటు వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మెడికల్ ఆక్సిజన్, లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్ వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. అవసరమైతే ఫోన్ చేసి అంబులెన్స్ కూడా తెప్పిస్తారన్నారు. అవసరమైన ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్‌బాబు, కార్డియాలజిస్ట్ డాక్టర్ జీవీ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ నాయక్, పినాకిల్ ఆస్పత్రి పరిపాలనాధికారిణి సీహెచ్ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.