మాతాశిశు మరణాలను అరికట్టేందుకు చర్యలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:04 AM
జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
టెన్త్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచన
పాడేరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సఫలీకృతం కావాలని, వాటిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా హైరిస్క్ గర్భిణులను ముందుగా గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించాలని, బాల్య వివాహాలు, మధ్యలో చదువు మానేయడం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, బర్త్ వెయిటింగ్ హాళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పక్కాగా అందించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, వాళ్లు ముందు గ్రేడుల్లోకి వచ్చేలా తయారు చేయాలన్నారు. పదో తరగతి వంద రోజుల ప్రత్యేక ప్రణాళికను పక్కాగా అమలు చేసి టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లోని పరిస్థితులను మెరుగుపరచాలని, నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, అధిక సంఖ్యలో ఇళ్లు ఉగాది నాటికి గృహ ప్రవేశం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పీ4లో బంగారు కుటుంబాలు, మార్గదర్శులను అనుసంధానించాలని, పీ4లో విజయగాథలపై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఐటీడీఏ పీవో శుభంనొక్వాల్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావు, ఐసీడీఎస్ పీడీ సీహెచ్. ఝాన్సీబాయి, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, హౌసింగ్ పీడీ బి.బాబునాయక్, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.