తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:25 AM
వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
- అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
- అల్లూరి, పోలవరం జిల్లాల అభివృద్థిపై వీడియో కాన్ఫరెన్స్
పాడేరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. అల్లూరి, పోలవరం జిల్లాలకు చెందిన అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేసే ప్రక్రియను చేపట్టాలన్నారు. అలాగే అంగన్‌వాడీ, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థానికంగానే ముడిసరుకులను సమకూర్చుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం, పలు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో నిరుద్యోగులకు అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణలు అందించాలని, విశ్వకర్మ యోజనలో రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచాలన్నారు. ప్రతి మండలంలోనూ సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పీ4లో భాగంగా బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శులను ఎంపిక చేయాలని, వారి విజయగాథలను గుర్తించి, వాటిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించే పోటీల్లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పాడేరు, అరకులోయ మండలాల్లో ఎక్కువ మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో భారీగా జాబ్‌మేళాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, జడ్పీ సీఈవో నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ బీవీ నాగేశ్వరరావు, స్వర్ణగ్రామ జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్, జిల్లా పరిశ్రమ శాఖాధికారి ఆర్‌వీ రమణారావు, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ జీఎన్ ప్రసాద్, మైనింగ్ ఏడీ ఆనంద్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ జి.డేవిడ్‌రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.