సజావుగా స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:35 PM
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి వెల్లడి
మారుమూల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్
ఎన్నికల కంట్రోల్ రూమ్ నంబర్: 9154693456
పాడేరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్, అడిషనల్ ఎస్‌పీ వై.శృతితో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 11 మండలాల్లో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది పని చేయాలని, ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
44 మారుమూల ప్రాంతాల్లో 3 గంటల వరకే పోలింగ్
జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతాల్లోని 44 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. జిల్లాలోని అరకులోయ మండలంలో 3, అనంతగిరిలో 4, ముంచంగిపుట్టులో 7, పెదబయలులో 6, హుకుంపేటలో 2, జి.మాడుగులలో 4, చింతపల్లిలో 2, జీకేవీధిలో 7, కొయ్యూరులో 8, పాడేరులో 1 పోలింగ్ కేంద్రం అత్యంత మారుమూల ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఉన్నాయని మండల స్థాయి అధికారులు తెలిపారన్నారు. దీంతో ఆయా 44 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరామని, అందుకు ఎన్నికల సంఘం అనుమతించిందన్నారు. ఈ విషయాన్ని ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఆయా ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా ప్రచారం చేపడతామన్నారు. ఎన్నిలకు సంబంధించిన విషయాలపై సమాచారం తెలుసుకునేందుకు స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ఎటువంటి విషయానికైనా కంట్రోల్ రూమ్ నంబర్ : 9154693456కు ఫోన్ చేయవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ఏర్పాటు
స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను కలెక్టర్ టి.నిషాంతి బుధవారం ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు, పెయిడ్ ప్రచారాలు, తదితర ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా జరిగే ప్రచారాలను గుర్తించేందుకు గాను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ), మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పీ వై.శృతి, సబ్‌కలెక్టర్ కె.సాహిత్, డీఎస్‌పీ వి.రాజసింహారెడ్డి, డీపీఆర్‌వో కె.అన్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.