Share News

కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:29 PM

ఏజెన్సీలో కాఫీ తోటల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ అసిస్టెంట్‌ పీవో ఎం.వెంకటేశ్వరరావు అన్నారు.

కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు
మాట్లాడుతున్న ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, పక్కన కాఫీ ఏడీ బొంజుబాబు

ఐటీడీఏ అసిస్టెంట్‌ పీవో ఎం.వెంకటేశ్వరరావు

పాడేరు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో కాఫీ తోటల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ అసిస్టెంట్‌ పీవో ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో కాఫీ తోటల అభివృద్ధి, విస్తరణ, రైతుల సంక్షేమం, తదితర అంశాలపై సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా కాఫీ తోటలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. అందులో భాగంగా కొత్తగా మొక్కలు నాటించడంతో పాటు పాత తోటల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తోటల పెంపకాన్ని చేపట్టే గిరిజన రైతుల భూముల స్థితిగతుల పరిశీలన, సిద్ధం చేయడం, నీడనిచ్చే మొక్కల పెంపకం ప్రాధాన్యతను వారికి వివరించాలన్నారు. కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడంలో భాగంగా అవసరమైనన్ని నర్సరీలను సిద్ధం చేసుకోవాలని, నాణ్యమైన మొక్కల ఉత్పత్తితోనే దిగుబడులు లభిస్తాయని రైతులకు తెలిపాలని సూచించారు. భూమిలో పోషక విలువల ఆధారంగా మాత్రమే సేంద్రీయ ఎరువుల వినియోగం, పెట్టుబడి వ్యయం తక్కువ కావడం వంటివి ఆధారపడతాయన్నారు. రైతుల భూముల్లోని మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని ఆయన సూచించారు. కాఫీ రైతులకు అందించే ప్రభుత్వ సాయాన్ని మొబైక్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. గతంలో కాఫీ తోటలకు సోకిన బెర్రీబోరర్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ముందు జాగ్రత్త చర్యలతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ ఎల్‌.బొంజుబాబు, కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌ సునీల్‌, సీనియర్‌ లైజన్‌ అధికారి ఎల్‌.రమేశ్‌, జూనియర్‌ లైజన్‌ అధికారులు, కాఫీ విభాగం క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:29 PM