Share News

ప్రాథమిక రంగాల అభివృద్థికి చర్యలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:18 AM

జిల్లాలో ప్రాథమిక రంగాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ప్రాథమిక రంగాల అభివృద్థికి చర్యలు
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాథమిక రంగాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం నుంచి ఉమ్మడి అల్లూరి జిల్లాలోని అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రాథమిక రంగాల పురోగతిలో వెనుకబాటుకు గురైన శాఖల అధికారులు అప్రమత్తమై లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యానవన, మత్స్య, పట్టు, పర్యాటకం, పశు సంవర్థక, అటవీ శాఖల్లో ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. పంటల సాగు, విస్తీర్ణంతో పాటు దిగుబడులు పెంచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అగ్రికల్చర్‌ ప్రొడక్షన్‌ బృందాలు, యువతను క్షేత్రస్థాయిలో సమన్వయపరిచి ముందుకు సాగాలన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ప్రాథమిక రంగాల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, చింతూరు ఐటీడీఏ పీవోలు శ్రీపూజ, శుభంనొక్వాల్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, జిల్లా మత్స్యశాఖాధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖరరావు, స్వర్ణగ్రామ శాఖ జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌ కుమార్‌, సీపీవో ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:18 AM