Share News

గిరిజనులకు సుస్థిర జీవనోపాధికి చర్యలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:15 AM

అడవులపై ఆధారపడే గిరిజనుల సుస్థిర జీవనోపాధికి చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రైబల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ట్రైఫెడ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.రాజమురుగన్‌ తెలిపారు.

గిరిజనులకు సుస్థిర జీవనోపాధికి చర్యలు
మాట్లాడుతున్న ట్రైఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.రాజమురుగన్‌

ట్రైఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.రాజమురుగన్‌

అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కృషి చేస్తామని వెల్లడి

పాడేరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అడవులపై ఆధారపడే గిరిజనుల సుస్థిర జీవనోపాధికి చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రైబల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ట్రైఫెడ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.రాజమురుగన్‌ తెలిపారు. స్థానిక ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఆడిటోరియంలో గిరిజన లబ్ధిదారులకు మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని గిరిజనులు సేకరించే అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి, మార్కెటింగ్‌ విధానాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రధానంగా చిన్న తరహా అటవీ ఉత్పత్తులు నేరుగా విక్రయించకుండా వాటికి విలువ జోడించడం ద్వారా వాటి సేకరణదారులైన గిరిజనులకు రెట్టింపు ఆదాయం లభిస్తుందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో వన్‌ధన్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి గిరిజనులు సేకరించే అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. స్థానిక గిరిజన ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించే స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. అలాగే డిజిటల్‌ ప్లాట్‌ఫారాలు, ఈ-కామర్స్‌, ఏఐ వంటి సాంకేతికతలను వినియోగించడం వలన డిజిటల్‌ బ్రాండింగ్‌ ద్వారా వినియోగదారులకు చేరువ అవుతుందని తెలిపారు. కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ స్థానిక ఐటీడీఏ పరిధిలో 98 వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించే చర్యలు చేపడుతున్నారని, ఫలితంగా రూ.కోటి 46 లక్షల విక్రయాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ట్రైఫెడ్‌ రెండు రాష్ట్రాల రీజనల్‌ మేనేజర్‌ భాస్కర్‌ ఝా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ జి.జయకృష్ణ, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు మాట్లాడారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వన్‌ధన్‌ వికాస కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన అడ్డాకుల ప్లేట్ల తయారీ కేంద్రాన్ని ట్రైఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.రాజమురుగన్‌, తదితరులు సందర్శించారు.

Updated Date - Oct 07 , 2026 | 12:15 AM