Share News

ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:26 AM

బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్‌ తరలించిన ఇద్దరు యువకులను గోపాలపట్నం పోలీసులు అరెస్ట్టు చేశారు.

ఎండీఎంఏ డ్రగ్స్‌ స్వాధీనం

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

కీలక నిందితుడి కోసం గాలింపు

గోపాలపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్‌ తరలించిన ఇద్దరు యువకులను గోపాలపట్నం పోలీసులు అరెస్ట్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు వెంకటాపురం మూడుగుళ్లు కూడలిలో ఆదివారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వెంకటాపురానికి చెందిన సుదర్శన్‌, అతని స్నేహితుడు సూరజ్‌లను తనిఖీ చేయగా 8 ప్యాకెట్లలో 6 గ్రాముల ఎండీఎంఏ సైకోటోపిక్‌ డ్రగ్‌ ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా ఆరిలోవ ప్రాంతానికి చెందిన కృష్ణకు బెంగళూరులోని డ్రగ్స్‌ ముఠాలతో సంబంధం ఉందని, వారికి కృష్ణ రూ.16 వేలు పంపగా తాము బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చి కృష్ణకు అందించడానికి వెళ్తున్నాని తెలిపారు. దీంతో వారిని అరెస్టు చేసి, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ కోసం గాలిస్తున్నట్టు సీఐ సన్యాసినాయుడు తెలిపారు.


ఆరిలోవ ప్రాంతానికి టీఎస్‌ఆర్‌ నుంచి నీటి సరఫరా

నీటి నాణ్యతపై జీవీఎంసీ అధికారుల తనిఖీలు

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నగరంలో తీవ్రనీటి ఎద్దడి నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందిలేకుండా చూసేందుకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ రూపొందించిన కార్యాచరణను అధికారులు అమలుచేస్తున్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్‌ఎస్‌వర్మ, పి.నల్లనయ్య, చీఫ్‌ ఇంజనీర్‌ పీవీవీ సత్యనారాయణరాజు, నీటిసరఫరా విభాగం ఎస్‌ఈ పల్లంరాజు, జోనల్‌కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కొళాయిలు, ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా తీరు, నాణ్యత తనిఖీ చేశారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. నీటిఇబ్బంది తీవ్రంగా ఉన్న ఆరిలోవ, శివాజీపాలెం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ముడసర్లోవ ఎండిపోవడం, బోర్లు అడుగంటిపోవడంతో ఆరిలోవ ప్రాంతానికి టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చీఫ్‌ఇంజనీర్‌ సత్యనారాయణరాజు స్థానికులకు వివరించారు. తీవ్ర నీటిఎద్దడి సమయంలోనూ ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తున్నామని, కొండప్రాంతాలకు ప్రెషర్‌ తగ్గకుండా అందిస్తున్నామన్నారు.


అందరికీ సబ్సిడీ బియ్యం

ఆధార్‌కార్డుపై రైతుబజార్లలో పంపిణీ

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రైతుబజార్‌లలో ఆధార్‌కార్డుపై ప్రతి కుటుంబానికీ నెలకు పదికిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని డీఎస్వో వి. భాస్కర్‌ తెలిపారు. కిలో రూ.50, రూ.52 చొప్పున రెండురకాల సన్నబియ్యం అందుబాటులో ఉన్నాయన్నారు. గత వారం రైతుబజార్‌లలో బియ్యంకార్డుదారుల కోసం కౌంటర్లు ప్రారంభించామని తాజాగా ఆదివారం నుంచి ఆధార్‌కార్డుపై అన్ని వర్గాల వారికి బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Updated Date - Aug 10 , 2026 | 12:26 AM