మేయర్‌కు పితృ వియోగం
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:14 AM
నగర మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
గుండెపోటుతో మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు కన్నుమూత
ఎల్.కోట సీతారాంపురంలో అంత్యక్రియలు రేపు
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
నగర మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. 2000 సంవత్సరంలో పార్టీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆయన కుమార్తె శ్రావణి 2021 మార్చిలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేసి గెలుపొందగా, ముత్యాలనాయుడి మరో కుమార్తె కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఇద్దరు కుమార్తెలతో పాటు ఆయనకు కిశోర్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయన కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. ముత్యాలనాయుడు మృతి గురించి కిశోర్ ఆస్పత్రి వద్ద విలేకరులతో మాట్లాడుతూ, తన తండ్రికి 2015లో గుండెకు బైపాస్ సర్జరీ జరిగిందన్నారు. ఇటీవల ఎన్నికల్లో విశ్రాంతి లేకుండా పనిచేశారన్నారు. ఎప్పటిలాగే ఆయన తన గదిలో ఒంటరిగా గురువారం రాత్రి నిద్రపోయారని, శుక్రవారం ఉదయం ఏడు గంటలైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా అపస్మారక స్థితిలో ఉన్నారని, వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే మరణించినట్టు వెల్లడించారన్నారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం ఉదయం స్వగ్రామమైన విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం సీతారాంపురంలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం పార్థివ దేహాన్ని 49వ వార్డు టీడీపీ కార్యాలయం వద్ద ఉంచామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ సంతాపం
ముక్కా ముత్యాలనాయుడు మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌లు సంతాపం ప్రకటించారు. సీఎం నేరుగా మేయర్ శ్రావణికి ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతోను మాట్లాడారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ముత్యాలనాయుడి మృతి పట్ల మంత్రి లోకేశ్ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.
పలువురు సంతాపం
ముక్కా ముత్యాలనాయుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, హోం శాఖ మంత్రి అనిత సంతాపం వ్యక్తంచేశారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు మత్యాలనాయుడు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్మించారు.
తిరుపతిలో మేయర్ శ్రావణి
తండ్రి మరణవార్త తెలుసుకొని తిరుగు ప్రయాణం
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
తన తండ్రి ముక్కా ముత్యాలనాయుడు మరణించిన సమయాన మేయర్ ముక్కా శ్రావణి నగరంలో లేరు. తిరుపతిలో మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తండ్రి మృతి వార్త తెలిసిన వెంటనే విశాఖపట్నం రావడానికి యత్నించారు. ఆమె తిరుపతి నుంచి చెన్నై వెళ్లి...విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విశాఖపట్నానికి రాత్రి పదకొండు గంటలకు చేరుకున్నారు. తండ్రి భౌతికకాయంపై పడి భోరున విలపించారు.
ప్రమాణ స్వీకారంపై తర్జనభర్జనలు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం విశాఖపట్నం కార్పొరేషన్‌కు మేయర్‌గా ఎన్నికైనవారు ఈ నెల 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే మేయర్ శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు మరణించడం, ఆయన అంత్యక్రియలు ఆదివారం (22న) నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించడంతో ఆ మరుసటిరోజే ప్రమాణ స్వీకారం ఉండడంతో కొంత సందిగ్ధం నెలకొంది. అప్పటికే మూడు రోజులు పూర్తికానుండడంతో ప్రమాణ స్వీకారానికి ఇబ్బందేమీ ఉండదని కుటుంబ సభ్యులకు పండితులు చెప్పినట్టు తెలిసింది.
నా జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు
తండ్రి మరణంపై శ్రావణి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తన జీవితంలో ఇది అత్యంత విషాదకరమైన రోజుగా పేర్కొన్నారు. తండ్రిగానే కాకుండా రాజకీయ జీవితానికి కూడా ఆయన దిశానిర్దేశం చేశారన్నారు. చివరి వరకు ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తానన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని వీడలేదని, విలువలు కోసం నిలబడ్డారని, తాను కూడా అదేబాటలో పయనిస్తానన్నారు.