Share News

గ్రేటర్‌లో మాయ

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:09 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో ఒక ఉన్నతాధికారి వ్యవహారశైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి.

గ్రేటర్‌లో మాయ

బీచ్‌ క్లీనింగ్‌ యంత్రాల కోసం రూ.14.5 కోట్లతో టెండర్లు పిలిచిన జీవీఎంసీ

అస్మదీయుడైన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టేందుకు ఇంజనీరింగ్‌ అధికారి ఎత్తుగడ

పోటీపడిన మరొక కాంట్రాక్టర్‌ను పక్కనపెట్టి అడ్డగోలుగా అప్పగింత

కమిషనర్‌కు అందిన ఫిర్యాదు

విచారణకు ఆదేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలో ఒక ఉన్నతాధికారి వ్యవహారశైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి. బీచ్‌లో చెత్తా,చెదారం తొలగించే యంత్రాలను సమకూర్చేందుకు పిలిచిన టెండర్లలో అవినీతి చోటుచేసుకుందని ఒక కాంట్రాక్టర్‌ నేరుగా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు.

నిత్యం జనసమర్థంగా కనిపించే బీచ్‌లను పరిశుభ్రంగా ఉంచాలని జీవీఎంసీ నిర్ణయించింది. సందర్శకులు ఎక్కువగా వచ్చే ఆర్కే బీచ్‌, కిర్లంపూడి లేఅవుట్‌, జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌, రుషికొండ, భీమిలి బీచ్‌ వంటి ప్రాంతాల్లో ఇసుక తెన్నెల్లో చెత్తా,చెదారంతోపాటు ఇతర వ్యర్థాలను తొలగించేందుకు యంత్రాలను ఉపయోగించాలని భావించింది. ఇప్పటికే జీవీఎంసీకి చెందిన రెండు యంత్రాలు పనిచేస్తున్నాయి. ఇవికాకుండా మరో ఐదు యంత్రాలను ప్రైవేటు కాంట్రాక్టరే సమకూర్చడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా చూసుకునేలా ఇంజనీరింగ్‌ విభాగం మూడు నెలల కిందట రూ.14.5 కోట్లతో టెండర్లు పిలిచింది. ఆ పని తమకు వచ్చేలా చూడాలని హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ ఒకరు జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలోని ఒక కీలక అధికారిని కలిశారు. సదరు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఉండేలా నిబంధనలను టెండరులో పొందుపరిచారు. అయితే హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌తోపాటు నగరానికి చెందిన మరొకరు కూడా బిడ్‌ దాఖలు చేయడంతో ముందుగానే అవగాహన కుర్చుకున్న అధికారితోపాటు కాంట్రాక్టర్‌ అవాక్కయ్యారు. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ తాను సమకూర్చే జర్మనీ కంపెనీ యంత్రం గంటకు ఆరు ఎకరాల్లో ఇసుకను శుభ్రం చేస్తుందని పేర్కొంటే, నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ తాను సమకూర్చే బెల్జియం కంపెనీ యంత్రం గంటకు ఏడు ఎకరాలను శుభ్రం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో ఏంచేయాలో తెలియక దాదాపు 60 రోజులపాటు టెండర్‌ తర్వాత దశలను పెండింగ్‌లో ఉంచేశారు. జీవీఎంసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవ్వడంతో ఎన్నికల కోడ్‌ వచ్చేస్తుందని, తర్వాత వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వడం కుదరదనే ఉద్దేశంతో సదరు అధికారి హడావిడిగా నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ బిడ్‌ను డిస్‌క్వాలిఫైచేసి, ముందుగా తాను మాట ఇచ్చిన హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు టెండర్‌ కేటాయిస్తూ ఫైల్‌ను కమిషనర్‌ ఆమోదానికి పంపించేశారు. దీనిపై నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ జీవీఎంసీ కమిషనర్‌కు నేరుగా ఫిర్యాదుచేశారు. తనను అన్యాయంగా అనర్హుడిగా ప్రకటించారని, దీని భారీ అవినీతి జరిగిందని ఫిర్యాదులో ఆరోపించారు.

రూ.50 లక్షలు కంటే ఎక్కువ విలువైన పనులకు సంబంధించిన టెండర్‌ను కచ్చితంగా జీవీఎంసీ, వీఎంఆర్‌డీ, ఏయూ ఇంజనీరింగ్‌ అధికారులతో కూడిన టెండర్‌ కమిటీకి పంపించి వారి ఆమోదం తర్వాతే కమిషనర్‌ వద్దకు పంపాల్సి ఉంటుంది. అయితే జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారి హడావిడిగా పంపించిన టెండర్‌ ఆమోదం ఫైల్‌లో ఏయూ ఇంజనీరింగ్‌ అధికారి సంతకం లేకపోవడంతో కమిషనర్‌ దానిని వెనక్కిపంపించడంతోపాటు టెండర్‌ను రద్దు చేసి, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఒక అదనపు కమిషనర్‌ను ఆదేశించారు. సదరు అదనపు కమిషనర్‌ రెండు రోజుల కిందట విచారణలో భాగంగా ఆ ఫైల్‌ పట్టుకుని తనవద్దకు రావాలని సదరు ఇంజనీరింగ్‌ అధికారిని ఆదేశించారు. కానీ ఆయన తన కిందపనిచేసే అధికారికి ఫైల్‌ ఇచ్చి విచారణ అధికారి వద్దకు పంపించారు. సదరు విచారణ అధికారికి కూడా రాష్ట్ర మంత్రి పీఏగా చెబుతున్న ఒకరు ఫోన్‌ చేసి, టెండర్‌ను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై జీవీఎంసీ కమిషనర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇంజనీరింగ్‌ అధికారుల్లో ఆసక్తి నెలకొంది.

Updated Date - Nov 11 , 2026 | 01:09 AM