Share News

జాఫ్రాకు గరిష్ఠ ధర

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:19 AM

గిరిజన ప్రాంతంలో జాఫ్రా(అన్నటో) ధరలు మరోసారి పెరిగాయి. రెండు వారాల వ్యవధిలో జాఫా ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కిలో జాఫ్రా గింజలను రూ.300 ధరకు కొనుగోలు చేస్తున్నారు.

జాఫ్రాకు గరిష్ఠ ధర
జాఫ్రా కాయల్లో గింజలు

ప్రాంతీయ మార్కెట్‌లో కిలో రూ.300కి కొనుగోలు

గూడెంకొత్తవీధి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో జాఫ్రా(అన్నటో) ధరలు మరోసారి పెరిగాయి. రెండు వారాల వ్యవధిలో జాఫా ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కిలో జాఫ్రా గింజలను రూ.300 ధరకు కొనుగోలు చేస్తున్నారు. జాఫ్రాకు అధిక ధర లభించడంతో ఆదివాసీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో రైతులు పంట పొలాల గట్లపై జాఫ్రాను సాగు చేస్తున్నారు. జాఫ్రా మొక్కల ఆకులను పశువులు ఆహారంగా తీసుకోవు. దీంతో రైతులు ప్రధానంగా పంట పొలాల గట్లపై కంచెగాను, మరోవైపు అదనపు ఆదాయం కోసం జాఫ్రాను సాగు చేస్తున్నారు. ఈ మొక్కల సాగుకు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నాట్లు వేసిన మూడో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభం అవుతుంది. ఈ మొక్కలకు తెగుళ్లు, పశువులు ఆశించిన దాఖలాలు లేవు. 2023 వరకు జాఫ్రా గింజలను ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు కిలో రూ.90-100 ధరకు కొనుగోలు చేసేవారు. 2024లో ఒకేసారి జాఫ్రా ధర రూ.170కి పెరిగింది. జాఫ్రా ధర పెరగడం వల్ల ఆదివాసీ రైతులు ఈ గింజలను ప్రత్యేకంగా సేకరించి మార్కెట్‌ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మార్కెట్‌ ప్రారంభంలోనే జాఫ్రా గింజలకు రూ.260-280 ధర లభించింది. సోమవారం అన్నవరం వారపు సంత, చింతపల్లి మార్కెట్‌లో వర్తకులు రూ.300 ధరకు కిలో జాఫ్రా గింజలను కొనుగోలు చేశారు.

Updated Date - Mar 03 , 2026 | 12:19 AM