లక్ష్యానికి దూరంగా మ్యాక్స్, జీసీసీ
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:09 PM
ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం(మ్యాక్స్) కాఫీ పండ్ల సేకరణ, పల్పింగ్‌లో లక్ష్యానికి దూరంగా వున్నది. మ్యాక్స్ సేకరణ లక్ష్యం 1,600 మెట్రిక్ టన్నులు కాగా.. నేటికి కేవలం 275 టన్నుల కాఫీ పండ్లను మాత్రమే కొనుగోలు చేసి పల్పింగ్ చేసింది. అదే బాటలో గిరిజన సహకార సంస్థ పయనిస్తున్నది. జీసీసీ లక్ష్యం 1,145 కాగా నేటికి 99 మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను మాత్రమే కొనుగోలు చేసింది. జీసీసీ, మ్యాక్స్ కాఫీ పండ్ల సేకరణలో వెనుకబడ్డాయి.
కాఫీ పండ్ల సేకరణ, పల్పింగ్‌లో వెనుకడుగు
గ్రేడింగ్, తేమ శాతంపై ఆంక్షలతో
వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
కాఫీ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులదే హవా
చింతపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):పాడేరు ఏజెన్సీలో గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్లకు అంతర్జాతీయ ధరలు అందించేందుకు మ్యాక్స్‌ని తెలుగుదేశం ప్రభుత్వం 2018 డిసెంబరు మూడో తేదీన ఏర్పాటు చేసింది. మ్యాక్స్ నిర్వహణకు పరిపాలన నిధులు రూ.1.57 కోట్లు, రివాల్వింగ్ ఫండ్ రూ.3.18 కోట్లు ట్రైకార్ నిధులను కేటాయించింది. అప్పట్లోనే చింతపల్లిలో ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణానికి రూ.5 కోట్లు గిరిజన సంక్షేమ శాఖ నిధులు కేటాయించింది. ఐటీడీఏ సహకారంతో గిరిజన రైతుల నుంచి మ్యాక్స్ కాఫీ పండ్లను సేకరించి, పల్పింగ్ చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నది. వచ్చిన ధర మొత్తం రెండు, మూడు విడతల్లో రైతులకు అందజేస్తున్నది. గత ఏడాది 621మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను సేకరించి గిరిజన రైతులకు కిలో కాఫీ పండ్లకు గరిష్ఠంగా రూ.60 ధరను అందించింది.
రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం
మ్యాక్స్ అందిస్తున్న గరిష్ఠ ధరలపై ఆదివాసీ రైతులకు అవగాహన కల్పించడంలో గిరిజన సంక్షేమ శాఖ విఫలమైంది. గతంలో కాఫీ పండ్లను మ్యాక్స్ మినహా ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కొనుగోలు చేసేవారు కాదు. దీంతో రైతులందరూకాఫీ పండ్లను మ్యాక్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకునేవారు. ప్రస్తుతం ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు సైతం కాఫీ పండ్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో కాఫీ పండ్ల మార్కెట్‌లో పోటీ ఏర్పడింది. ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కాఫీ పండ్లను కిలో రూ.70-75ధరకు కొనుగోలు చేస్తున్నాయి. మ్యాక్స్ తొలి విడతగా ఏగ్రేడ్ కాఫీ పండ్లు రూ.70, బీగ్రేడ్ రూ.60 ధరలకు కొనుగోలు చేస్తున్నది. కాఫీ పండ్లను గ్రేడ్లుగా విభజించి కొనుగోలు చేయడంతో రైతులు మ్యాక్స్‌కి విక్రయించేందుకు ముందుకు రావడంలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన ఆదాయంలో రైతులకు బోనస్ అందజేస్తామని ప్రచారం చేయడంలో కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. గతంలో ఐటీడీఏ లైజన్ వర్కర్లు, ఉద్యాన, వ్యవసాయ అధికారులు సైతం కాఫీ మార్కెటింగ్‌లో భాగస్థులను చేశారు. ప్రస్తుతం కేవలం లైజన్ వర్కర్లు, ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు పరిధిలోని ఉద్యోగులు మాత్రమే కాఫీ పండ్ల మార్కెటింగ్‌లో ఉండడంతో లక్ష్యాలను సాధించలేకపోతున్నారు.
దెబ్బతీసిన కాఫీ బెర్రీ బోరర్
ఈ ఏడాది కాఫీ బెర్రీ బోరర్ కీటకం గిరిజన రైతులు, మ్యాక్స్‌ని దెబ్బతీసింది. కాఫీ బెర్రీ బోరర్ అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో కనిపించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కీటకం వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టింది. కాఫీ బెర్రీ బోరర్ కీటకం కారణంగా అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల నుంచి కాఫీ పండ్లను చింతపల్లికి తీసుకు రావడంలేదు. ఈ మూడు మండలాల నుంచి కాఫీ పండ్ల సేకరణ లేకపోవడంతో మ్యాక్స్ లక్ష్యం చేరుకోలేకపోతున్నది.
కాఫీ మార్కెటింగ్‌లో జీసీసీ వెనుకడుగు
మ్యాక్స్ తరహాలోనే గిరిజన సహకార సంస్థ కాఫీ మార్కెటింగ్‌లో వెనుకబడింది. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు ఆధారంగా జీసీసీ గరిష్ఠ ధరలకు కాఫీ పార్చిమెంట్, చెర్రీని కొనుగోలు చేసింది. గత ఏడాది కిలో పార్చిమెంట్ రూ.400, చెర్రీ రూ.250ధరలకు కొనుగోలు చేసింది. ఈఏడాది జీసీసీ కాఫీ మార్కెటింగ్‌ని ఆలస్యంగా ప్రారంభించింది. అపెక్స్ కమిటీ సకాలంలో సమావేశం కాకపోవడంతో ధరలు ప్రకటించడంలోనూ ఆలస్యం చేసింది. ప్రస్తుతం జీసీసీ కాఫీ పార్చిమెంట్ కిలో రూ.450, చెర్రీ రూ.270, రొబస్ట్రా రూ.170 ధరలకు కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ తేమశాతం 12కి తక్కువగా ఉంటే కాఫీ గింజలను కొనుగోలు చేయడంలేదు. దీంతో గిరిజనులు జీసీసీకి విక్రయించడానికి రైతులు ఆసక్తి చూపడంలేదు. ప్రైవేటు వర్తకులు తేమశాతం 12 కంటే తక్కువగా ఉన్నప్పటికి కాఫీ చెర్రీని కొనుగోలు చేస్తున్నారు. అయితే జీసీసీ చెర్రీ రూ.270 కొనుగోలు చేస్తుండగా.. ప్రైవేటు వర్తకులు రూ.240-250 ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు వర్తకులు తక్కువ ధర చెల్లిస్తున్నప్పటికీ తేమ శాతాన్ని పెద్దగా పట్టించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. దీంతో అధిక సంఖ్యలో రైతులు కాఫీ గింజలను ప్రైవేటు వర్తకులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో కాఫీ మార్కెటింగ్‌లో ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌ఫీవోల హవా కొనసాగుతున్నది.