ఎట్టకేలకు మ్యాక్స్ కాఫీ గింజలు విక్రయం
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:42 PM
ఆదివాసీ రైతులకు ఐటీడీఏ సహకారంతో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్న ది విశాఖ, చింతపల్లి గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం(మ్యాక్స్) ఎట్టకేలకు కాఫీ గింజలను ఓ ప్రైవేటు కంపెనీకి విక్రయించింది. సరైన మద్దతు ధర లభించక ఆరు నెలలుగా కాఫీ గింజలను మ్యాక్స్ గోదాములకే పరిమితం చేసింది. గింజలను భద్రపర్చే పరిస్థితి లేక బెంగళూరుకి చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కిలో రూ.482లకు విక్రయించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధర భారీగా తగ్గిపోవడంతో ఈ ఏడాది రైతులకు బోనస్ ప్రశ్నార్థకంగా మారింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన ధరలు
ఆరు నెలలు గోదాములకే పరిమితమైన కాఫీ
కిలో రూ.482 ధరకు అమ్మకం
ఈఏడాది రైతులకు బోనస్ అందేనా?
చింతపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు పండించిన కాఫీకి అంతర్జాతీయ ధరలు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం 2016లో మ్యాక్స్‌ని ఏర్పాటు చేసింది. మ్యాక్స్ నిర్వహణకు మూలధనాన్ని ట్రైకార్ నుంచి సమకూర్చింది. ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్‌కి అనుబంధంగా చింతపల్లిలో రూ.మూడు కోట్లతో అత్యాధునిక కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేసింది. మ్యాక్స్‌లో 1,400 మంది గిరిజన రైతులు శాశ్వత సభ్యులుగా ఉన్నారు. ప్రతి ఏడాది ఏజెన్సీలోని 11 మండలాల నుంచి 16వేల మంది రైతులు కాఫీ పండ్లను మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ముందు ఏడాది ధరల ఆధారంగా కిలోకి తొలి ధర చెల్లించి, గింజలు మార్కెటింగ్ చేయగా వచ్చిన ఆదాయం నుంచి బోనస్ చెల్లిస్తున్నారు. 2024-25లో రైతులకు తొలి ధరగా కిలోకి రూ.44 చెల్లించి, గింజలు విక్రయించగా వచ్చిన లాభాల నుంచి రెండు విడతల్లో కిలోకి రూ.16 బోసన్ చెల్లించారు.
దెబ్బతీసిన అంతర్జాతీయ మార్కెట్
గిరిజన కాఫీ రైతులు, మ్యాక్స్‌కి 2025-26లో అంతర్జాతీయ ధరలు భారీగా దెబ్బతీశాయి. ఈ ఏడాది మార్కెట్ ప్రారంభంలో కాఫీకి గరిష్ఠ ధర లభించింది. కిలో పార్చిమెంట్‌కి రూ.550-560 ధర పలికింది. దీంతో గిరిజన సహకార సంస్థ కిలో పార్చిమెంట్‌కి రూ.450 మద్దతు ధర ప్రకటించింది. అయితే కాఫీ ఉత్పత్తిలో దిగ్గజాలైన బ్రెజిల్, వియత్నంలో కాఫీ దిగుబడులు గణనీయంగా పెరగడంతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోయాయి. కిలో పార్చిమెంట్ రూ.250-300 ధరకు చేరుకుంది. దీంతో గిరిజన రైతులు, మ్యాక్స్ మద్దతు ధర పొందలేకపోయారు.
జీసీసీ నిర్ణయంతో రైతులకు నష్టం
గిరిజన సహకార సంస్థ ఉన్నతాధికారుల నిర్ణయాలతో కాఫీ రైతులకు భారీ నష్టం వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ ధర హెచ్చుతగ్గులను గమనించకుండా కిలో పార్చిమెంట్ రూ.450, చెర్రీ కిలో రూ.270ధరలుగా ప్రకటించింది. చెర్రీకి అధిక ధర వస్తుందనే ఆశతో ఆదివాసీ రైతులు పండ్లు సేకరించి మ్యాక్స్‌కి అందజేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈఏడాది మ్యాక్స్ కేవలం 312 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను మాత్రమే సేకరించింది. మెజారిటీ కాఫీ గింజలను రైతులు చెర్రీగానే ఉత్పత్తి చేసి జీసీసీకి విక్రయించేందుకు సిద్ధపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు నిలిపివేసింది. దీంతో గిరిజన రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వర్తకులకు విక్రయించుకోవాల్సి వచ్చింది. జీసీసీపై ఆధారపడకుండా పండ్లను మ్యాక్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటే నష్టం వచ్చేదికాదని అభ్యుదయ రైతులు అభిప్రాయపడుతున్నారు.
మూడు విడతల్లో విక్రయాలు
రైతుల నుంచి సేకరించిన కాఫీ పండ్లను పార్చిమెంట్‌గా ఉత్పత్తి చేసి మ్యాక్స్ మూడు విడతల్లో గింజలను విక్రయించింది. రైతుల నుంచి సేకరించిన 312 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్ల నుంచి 60 మెట్రిక్ టన్నుల పార్చిమెంట్ ఉత్పత్తి చేశారు. మార్కెట్ ప్రారంభం(జనవరి)లో తొలివిడతగా 12మెట్రిక్ టన్నులు కిలో రూ.547, రెండో విడతగా 13.890 టన్నులు రూ.530ధరకు విక్రయించారు. అనంతరం అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ గింజల ధరలు పడిపోవడంతో మ్యాక్స్ ఉత్పత్తి చేసిన పార్చిమెంట్‌ని ఎకో పల్పింగ్ గోదాములో భద్రపర్చారు. కాఫీ ధరలు పెరుగుతాయని ఐటీడీఏ, కాఫీ ప్రాజెక్టు అధికారులు నిరీక్షించినప్పటికీ ఫలితం కనిపించలేదు. దీంతో బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ కిలో రూ.482 ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో మ్యాక్స్, ఐటీడీఏ అధికారులు రెండు రోజుల క్రితం 35 మెట్రిక్ టన్నులను విక్రయించారు.
బోనస్ రైతులకు అందేనా..?
ఈ ఏడాది మ్యాక్స్ నుంచి బోనస్ అందుతుందా అన్న సందేహాన్ని రైతులు వ్యక్తంచేస్తున్నారు. మ్యాక్స్ మార్కెటింగ్ ప్రారంభించిన నాటి నుంచి ప్రతి ఏడాది రైతులకు బోనస్ చెల్లిస్తున్నది. ఈ ఏడాది తొలి ధరగా కిలో కాఫీ పండ్లకు రూ.70 గరిష్ఠ ధరను అందించారు. కాగా మార్కెట్‌లో కాఫీ ధరలు పడిపోవడంతో రైతులు నేటి వరకు బోనస్ కోసం మ్యాక్స్‌పై వత్తిడి చేయలేదు. మ్యాక్స్, ఐటీడీఏ అధికారులు కాఫీ గింజలను పూర్తి స్థాయిలో విక్రయించడంతో బోనస్ వస్తుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.