ముంచిన మావిగన్
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:21 AM
అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను రాజధానిగా ప్రకటించాలని, ఆ మూడింటి మొదటి అక్షరాలతో ‘మావిగన్’ అనే పేరు పెట్టాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం రుచించలేదు.
వైసీపీ నేతల ఆందోళన
అమరావతికి ప్రత్యామ్నాయంగా జగన్ చేసిన ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్
ఆ సలహా ఎవరిదంటూ కార్యకర్తల ప్రశ్నల వర్షం
సమాధానం చెప్పలేక నేతల ఉక్కిరిబిక్కిరి
స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం తప్పదని ఆందోళన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను రాజధానిగా ప్రకటించాలని, ఆ మూడింటి మొదటి అక్షరాలతో ‘మావిగన్’ అనే పేరు పెట్టాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం రుచించలేదు. ‘మావిగన్’ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో వైసీపీ నేతలు కూడా డీలాపడ్డారు. ఇప్పటికే ఆత్మవిశ్వాసంతో ఉన్న కూటమికి ఈ ఉదంతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత కలిసొచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో జగన్మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. మాజీ సీఎం హోదాలో జగన్ అత్యవసర మీడియా సమావేశం అనేసరికి ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తారేమోనని అందరూ భావించారు. కానీ మూడు నగరాలను కలిపి ‘మావిగన్’ పేరుతో రాజధాని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అమరావతిని రాజధానిగా చేయడం ఇష్టం లేకపోతే ఆ విషయం ప్రకటించవచ్చు. గతంలో తాము ప్రకటించిన మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్టు చెప్పవచ్చు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో మూడు నగరాల మొదటి అక్షరాలను తీసుకుని ‘మావిగన్’ పేరుతో రాజధానిని ప్రతిపాదించడంతో వైసీపీకి చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా విస్తుబోయారు. ‘మావిగన్’పై సోషల్ మీడియాలో ఇప్పటికీ విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ పరిణామాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటకు ఏదో జగన్ ప్రతిపాదనను సమర్థిస్తున్నట్టు మాట్లాడుతున్నా, లోలోపల తీవ్రంగా మథనపడుతున్నారు. అసలు జగన్‌కు ‘మావిగన్’ పేరును ఎవరు సూచించారని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తుండడంతో ఏం చెప్పాలో అర్థంకాక మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నగరానికి చెందిన వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు.
త్వరలో జరిగే స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం
‘మావిగన్’ అంశం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కూటమిని నిలువరించేందుకు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయంలో ఆలోచనారహితంగా, ఆచరణ సాధ్యం కాని ‘మావిగన్’ ప్రతిపాదన చేసి ప్రజల్లో పార్టీని చులకన చేశారని గగ్గోలు పెడుతున్నారు. ప్రజల్లోకి వెళితే మావిగన్ పేరుతో వెటకారంగా మాట్లాడుతున్నారని కొందరు నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న తమ పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను ‘మావిగన్’ వ్యవహారం మరింత దెబ్బతీసిందని నేతలు వాపోతున్నారు.