Share News

మాతృ మరణాలు జరగకూడదు

ABN , Publish Date - May 02 , 2026 | 11:11 PM

మాతృ మరణాలు సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులదేనని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పష్టం చేశారు.

మాతృ మరణాలు జరగకూడదు
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

వైద్యాధికారులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): మాతృ మరణాలు సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులదేనని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల పరిధిలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై శనివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో డిస్ర్టిక్ట్‌ మెటర్నిటీ డెత్‌ సర్వేలెన్స్‌, రెస్పాన్స్‌ కమిటీ సమావేశంలో వైద్యాధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయ ఆరోగ్య అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ జనవరి 2026 నుంచి మార్చి 2026 మధ్యకాలంలో జరిగిన నాలుగు మాతృ మరణాలపై కలెక్టర్‌కు వివరించారు. ఆధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ మాతా శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను వైద్యాధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. మాతృ మరణాలు సంభవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత ఆరోగ్య కేంద్రం మెడికల్‌ అధికారిపై ఉంటుందని, సంబంధిత ఏఎన్‌ఎం సమయానికి గర్భిణికి అవసరమైన సేవలను గుర్తించి అందజేయాలన్నారు. ఇక ముందు మాతృ మరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామని, హైరిస్క్‌ గర్భిణులు ప్రసవానికి వచ్చినప్పుడు కాలయాపన చేయకుండా జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేయడం ద్వారా సురక్షిత కాన్పు జరిగేలా చూడవచ్చని వైద్యాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ హైమావతి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 11:11 PM