మాతాశిశు మరణాలు అరికట్టాలి
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:04 PM
జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
పాడేరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మాతాశిశు ఆరోగ్య సంబంధ అంశాలపై వైద్యారోగ్యశాఖాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సఫలీకృతం కావాలని, వాటిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా హైరిస్క్ గర్భిణులను ముందుగా గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించాలన్నారు. మాతాశిశు మరణాల రేటును తగ్గించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బాల్య వివాహాలు, మధ్యలో చదువు మానేయడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, బర్త్ వెయిటింగ్ హాళ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పక్కాగా అందించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు సకాలంలో అవసరమైన వైద్య సేవలు అందించాలని, నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వారికి నెలకు రెండు మార్లు ఆర్యోగ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రుల్లో గర్భ నిర్ధారణ పరీక్షల నిర్వహణ, డేటా సేకరణలో డీఎంహెచ్‌వో తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై గర్భ నిర్ధారణ అంశాల్లో పక్కాగా ఉండాలన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
చట్ట రీత్యా నేరమైన లింగ నిర్ధారణ పరీక్షలను ఎవరు నిర్వహించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకూడదని, వైద్యారోగ్య శాఖాధికారులు, జిల్లా సలహా కమిటీ ప్రతినిధులు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేస్తే వారి స్కానింగ్ సెంటర్ లైసెన్సును రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్, మెడికల్ కాలేజీ గైనికాలజి నిపుణుడు టి.నరసింగరావు, వైద్యులు శ్రీలత, ఎం.కిరణ్‌కుమార్, డిప్యూటీ డెమో సింహాచలం, అమెరికన్ ఫౌండేషన్ ప్రతినిధి సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.