Share News

మన్యంలో మాతా, శిశు మరణాలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:09 PM

మన్యంలో మాతాశిశు మరణాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైద్యులు, క్షేత్ర స్థాయి ఉద్యోగుల పర్యవేక్షణాలోపం కారణంగా ఆశించిన ఫలితం నెరవేరడం లేదు.

మన్యంలో మాతా, శిశు మరణాలు
మృతి చెందిన బాలింత లోవ శాంతి (ఫైల్‌)

వైద్యులు, స్థానిక సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

విచారణకు కలెక్టర్‌ ఆదేశం

చింతపల్లి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మన్యంలో మాతాశిశు మరణాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైద్యులు, క్షేత్ర స్థాయి ఉద్యోగుల పర్యవేక్షణాలోపం కారణంగా ఆశించిన ఫలితం నెరవేరడం లేదు. సకాలంలో వైద్యం అందక అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ కొలపరి గ్రామానికి చెందిన లోవ శాంతి (23) మృత శిశువుకు జన్మనిచ్చి, సోమవారం రాత్రి కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతిచెందింది. సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. లోవ శాంతి నెలలు నిండడంతో ఆశ కార్యకర్తతో కలిసి ఈనెల 14, 15 తేదీల్లో చింతపల్లి ఏరియా ఆస్పతికి వచ్చి పరీక్షలు చేయించుకుంది. పద్దెనిమిదో తేదీన మరోసారి ఏరియా ఆస్పత్రికి రాగా స్త్రీ వైద్య నిపుణులు తనిఖీ నిర్వహించి రక్తపరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఆమె పరీక్ష చేయించుకుని, రిపోర్టు తీసుకుని వైద్యురాలికి చూపించకుండగా ఇంటికి వెళ్లిపోయింది. సాధారణంగా నెలలు నిండిన గర్భిణిని పీహెచ్‌సీ వైద్యులు, స్థానిక ఏఎన్‌ఎం గుర్తించి ప్రసవానికి పది రోజుల ముందు చింతపల్లి గర్భిణుల వసతి గృహంలో చేర్పించాల్సి ఉంది. అయితే శాంతి విషయంలో అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. 19వ తేదీన ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా ఆదేరోజు రాత్రి శాంతి మృత శిశువుకు జన్మనిచ్చింది. ఆమె ఆరోగ్యం విషమంగా మారడంతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు సూచించారు. 20వ తేదీన కుటుంబ సభ్యులు బాలింత లోవ శాంతిని కేజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం క్షీణించడం వల్ల 21వ తేదీన మృతిచెందింది. సకాలంలో మెరుగైన వైద్యం అందితే ఆమె మృతి చెంది ఉండేదికాదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ నిషాంతి ఆదేశించారు. కాగా మృతురాలు కుటుంబ సభ్యులకు గర్భిణి వైద్య ఖర్చులు అందజేస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు. కాగా గర్భిణి మృతిపై మంగళవారం కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రి వైద్యులతో చర్చించారు.

Updated Date - Sep 22 , 2026 | 11:09 PM