Share News

గోవాడ లో భారీ చోరీ

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:23 AM

మండలంలోని గోవాడ గ్రామంలో ఒక దంత వైద్యుడి నివాసంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంటి మెయిన్‌ డోర్‌ తలుపులు తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాల్లో ఉన్న 70 తులాల బంగారం, 30 కిలోల వెండివస్తువులతో పాటు రూ.6 లక్షల నగదు అపహరించుకుపోయారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయలు వుంటుందని బాధితులు చెబుతున్నారు. భారీ చోరీకి సంబంధించి వివరాలిలా వున్నాయి.

గోవాడ లో భారీ చోరీ
చోరీ జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం

దంత వైద్యుడి నివాసంలో 70 తులాల బంగారం, 30 కిలోల వె ండి, రూ.6 లక్షల నగదు అపహరణ

సొత్తు విలువ రూ.2.5 కోట్లుపైనే

రంగంలోకి పోలీసులు, క్లూస్‌టీమ్‌

చోడవరం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవాడ గ్రామంలో ఒక దంత వైద్యుడి నివాసంలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంటి మెయిన్‌ డోర్‌ తలుపులు తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాల్లో ఉన్న 70 తులాల బంగారం, 30 కిలోల వెండివస్తువులతో పాటు రూ.6 లక్షల నగదు అపహరించుకుపోయారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయలు వుంటుందని బాధితులు చెబుతున్నారు. భారీ చోరీకి సంబంధించి వివరాలిలా వున్నాయి.

గోవాడలో ప్రధాన రోడ్డును ఆనుకుని ఎం.అప్పారావు అనే డాక్టర్‌ చాలాకాలం నుంచి ‘శ్రీ లక్ష్మీ తులసీ సుజాత క్లినిక్‌’ పేరుతో దంత వైద్యశాలను నిర్వహిస్తున్నారు. దీని పైఅంతస్థులో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. డాక్టర్‌ అప్పారావు గత ఏడాది మృతిచెందగా, కొన్ని రోజుల తరువాత ఆయన భార్య కూడా కాలంచేశారు. డాక్టర్‌ కుమార్తెల్లో ఒకరైన సుజాత, ఒక కుమారుడు విశాఖపట్నంలో ఉంటూ రెండు, మూడు రోజులకు ఒకసారి గోవాడ ఇంటికి వచ్చిపోతున్నారు. శుక్రవారం గోవాడ వచ్చిన వీరు.. రాత్రికి ఇక్కడే వుండి శనివారం తిరిగి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం విశాఖ నుంచి గోవాడ వచ్చిన సుజాత.. ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి తాళాలు వేసి వుండడంతో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెయిన్‌ డోరు తాళాలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాల్లో భద్రపరిచిన సుమారు 70 తులాల బంగారం ఆభరణాలు, 30 కిలోలకుపైగా వెండి వస్తువులు, సుమారు రూ.6 లక్షల నగదు అపహరించుకుపోయారని ఆమె తెలిపారు. చోరీకి గురైన బంగారంలో కొంతమొత్తాన్ని గతంలో చోడవరం బ్యాంకులో తనఖా పెట్టామని, పది రోజుల క్రితం వీటిని విడిపించి గోవాడలోని ఇంటిలో భద్రపరిచినట్టు ఆమె చెబుతున్నారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.2.5 కోట్లు వుంటుందని అంచనాగా చెప్పారు.

చోరీ సమాచారం అందుకున్న సీఐ బి.అప్పలరాజు గోవాడ వచ్చి పరిశీలించారు. అనకాపల్లి నుంచి క్లూస్‌టీం వచ్చి పలు ఆధారాలు సేకరించారు. అడిషనల్‌ ఎస్పీ మోహన్‌రావు, అనకాపల్లి డీఎస్పీ కె.శ్రావణి వచ్చి పరిశీలించారు. సుజాతతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగతనాల్లో ఆరితేరిన వ్యక్తులే గోవాడలో చోరీకి పాల్పడినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వీరికి స్థానికులు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే డాక్టర్‌ అప్పారావు మృతిచెందిన తరువాత కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగినట్టు, బీరువా తాళాలు హైదరాబాద్‌లో ఉంటున్న మరో కుమారుడి వద్ద వున్నట్టు తెలియడంతో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు.

Updated Date - Mar 09 , 2026 | 01:23 AM