గంటావానిపాలెంలో భారీ చోరీ
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:52 AM
మండలంలోని గంటావానిపాలెం గ్రామంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో భద్రపరిచిన సుమారు 18.5 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.
18.5 తులాల బంగారు ఆభరణాలు అపహరణ
రూ.30 లక్షలకుపైగా విలువ ఉంటుందని అంచనా
మునగపాక, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని గంటావానిపాలెం గ్రామంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో భద్రపరిచిన సుమారు 18.5 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. వీటి విలువ రూ.30 లక్షల వరకు వుంటుందని బాధితులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
గంటావానిపాలెం గ్రామానికి చెందిన కరణం శ్రీనివాసరావు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరి కంపెనీకి వెళ్లారు. కొద్దిసేపటి తరువాత భార్య ఉమావతి, ఇద్దరు పిల్లలతో కలిసి పక్క గ్రామంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను తిలకించడానికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చారు. తలుపులు తీసి వుండడంతో ఆందోళన చెంది, లోపలికి వెళ్లిచూడగా బీరువా తెరిచివుంది. అందులో భద్రపరిచిన పలు బంగారు ఆభరణాలు కనిపించలేదు. అప్పటికే అర్ధరాత్రి కావడం, భర్త డ్యూటీకి వెళ్లడంతో సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ధనుంజయరావు, క్లూస్ టీమ్ వెళ్లి పరిశీలించారు. పలుచోట్ల వేలిముద్రలు సేకరించారు. ఏయే ఆభరణాలు చోరీకి గురయ్యాయో బాధితులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 18.5 తులాల ఆభరణాలు కనిపించడం లేదని శ్రీనివాసరావు, ఉమావతి చెప్పారు. వీటి విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.30 లక్షల వరకు వుంటుందని తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.