Share News

ఎలమంచిలిలో భారీ చోరీ

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:50 AM

పట్టణంలోని కొత్తపాలెం ప్రాంతంలో బుధవారం పట్టపగలు ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో వున్న తొమ్మిది తులాల బంగారు ఆభరణాలో అపహరించుకుపోయారు. ఈ సంఘటపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఎలమంచిలిలో భారీ చోరీ
చోరీ జరిగిన ఇంటిలో బీరువాను పరిశీలిస్తున్న ఎస్‌ఐ సావిత్రి

పట్టపగలు తొమ్మిది తులాల బంగారు ఆభరణాల అపహరణ

సొత్తు విలువ రూ.15 లక్షలపైమాటే..

ఎలమంచిలి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కొత్తపాలెం ప్రాంతంలో బుధవారం పట్టపగలు ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో వున్న తొమ్మిది తులాల బంగారు ఆభరణాలో అపహరించుకుపోయారు. ఈ సంఘటపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

కొత్తపాలెం చెరకు కొనుగోలు కేంద్రం సమీపంలో పంట పొలాల వద్ద నిర్మించుకున్న ఇంటిలో బొడ్డేటి సంతోశ్‌, భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసం వుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం సంతోశ్‌ ఇంటికి సమీపంలో వున్న పొలంలో పనులు చేసుకుంటున్నారు. ఎలమంచిలిలో కుమార్తెలు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం కావడంతో భార్య అక్కడకు వెళ్లింది. ఎప్పటి మాదిరిగానే ఇంటికి తాళం వేసి, తాళం చెవిని బయట రహస్య ప్రదేశంలో పెట్టారు. ఆమె సాయంత్రం తిరిగి వచ్చి, తాళం తీసి ఇంటిలోకి వెళ్లింది. ఆభరణాలను భద్రపరిచిన పెట్టె మంచంపై వుండడంతో అనుమానం వచ్చి బీరువా తెరిచి చూసింది. ఇందులో భద్రపరిచిన తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె.. సమీపంలోని పొలంలో వున్న భర్త వద్దకు వెళ్లి చోరీ జరిగిన విషయం చెప్పింది. సంతోశ్‌ ఇంటికి వచ్చి మరోసారి బీరువాలో పరిశీలించారు. బంగారం వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐ సావిత్రి, సిబ్బందితో వచ్చి పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి పలుచోట్ల వేలిముద్రలు సేకరించింది. మంగళవారం తమ కుమార్తె పుట్టిన రోజును బంధువులతో కలిసి జరుపుకున్నామని, మరుసటి రోజే బంగారం చోరీకి గురైందని భార్యాభర్తలు వాపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన బంగారం ఆభరణాల విలువ సుమారు రూ.15 లక్షలు వుంటుందని బాధితులు తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 12:50 AM