చెత్త తరలింపులో మహా మాయ
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:20 AM
చెత్తను లారీలు, టిప్పర్లు, టాటా ఏస్ వంటి మినీగూడ్స్ వ్యాన్‌లలో తరలిస్తుంటారు.
తాము వినియోగించిన వాహనాలవిగా పేర్కొంటూ కొన్ని నంబర్లు జీవీఎంసీ మెకానికల్ ఇంజనీరింగ్
అధికారులకు అందజేసిన కాంట్రాక్టర్లు
అందులో బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల నంబర్లు...
గుడ్డిగా ఎంబుక్‌లో నమోదు
గతంలో ఇద్దరు తిరస్కరించిన ఫైల్‌కు మూడు నెలల కిందట ఒక అధికారి క్లియరెన్స్
బిల్లు చెల్లింపు కోసం అకౌంట్స్ విభాగానికి సిఫారసు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
చెత్తను లారీలు, టిప్పర్లు, టాటా ఏస్ వంటి మినీగూడ్స్ వ్యాన్‌లలో తరలిస్తుంటారు. బస్సుల్లో, ఆటోల్లో, ద్విచక్ర వాహనాలపై ఎవరూ తరలించరు. కానీ చెత్తను వాటిల్లో తరలించినట్టు కాంట్రాక్టర్ బిల్లు పెడితే...ఘనత వహించిన జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు గుడ్డిగా ఆమోదించేశారు. మెకానికల్ విభాగంలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనే దానికి ఈ ఉదంతమే నిదర్శనంగా ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బందే పేర్కొంటున్నారు.
జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణ, తరలింపు, జోన్‌ల పరిధిలో చెత్త బదిలీ కేంద్రాల (జీటీఎస్) నిర్వహణ, అక్కడి నుంచి చెత్త కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలింపు, గెడ్డల్లో పూడికతీత, రోడ్లు శుభ్రంచేయడం, బీచ్‌లో చెత్తను ఏరివేయడం వంటి పనుల కోసం ఉపయోగించే వాహనాలు, యంత్రాల నిర్వహణ, ఇంధనం సరఫరా వంటివి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. దీనికోసం మెకానికల్ విభాగానికి ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జోన్‌ల వారీగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వారి కింద మరికొందరు అధికారులు, ఉద్యోగులు పనిచేస్తుంటారు.
అయితే 2023 డిసెంబరులో పారిశుధ్య కార్మికులతోపాటు, క్లాప్ వాహనాల డ్రైవర్లు, సిబ్బంది నెలరోజులపాటు సమ్మెకు దిగారు. ఆ సమయంలో పారిశుధ్య నిర్వహణకు ప్రైవేటు వాహనాలను వినియోగించాలనుకున్నారు. జోన్‌కు 50 వాహనాలు (ఒక్కొక్కదానికి రూ.1.75 లక్షలు) చొప్పున కేటాయించేందుకు అప్పటి మేయర్ గొలగాని హరివెంకటకుమారి ముందస్తు ఆమోదంతో షార్ట్ టెండర్లు పిలిచారు. ఆ సమయంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లలో కొందరు చెత్తను తరలించేందుకు అధికారులు అడిగిన దానికంటే తక్కువ వాహనాలను వినియోగించారు. అయితే నిబంధనల ప్రకారం జోన్‌కు 50 వాహనాలను పెట్టి చెత్తను తరలించినట్టు చూపించకపోతే బిల్లు వచ్చే అవకాశం ఉండదని కాంట్రాక్టర్లు గుర్తించారు. దీంతో తాము చెత్త తరలించేందుకు ఉపయోగించిన వాహనాలవిగా పేర్కొంటూ కొన్ని నంబర్లను అధికారులకు ఇవ్వగా, వారు కనీస పరిశీలన చేయకుండా ఎంబుక్‌లో నమోదుచేశారు. అందులో బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల నంబర్లు ఉన్నాయి. ప్రైవేటు వాహనాలతో చెత్త తరలింపునకు సంబంధించిన టెండర్ల ర్యాటిఫికేషన్ కోరుతూ అప్పటి మెకానికల్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2024 మార్చిలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదన పెట్టారు. అయితే ఫైల్ తయారుచేయడంలో కొన్ని లోపాలు ఉండడంతో అప్పటి స్టాండింగ్ కమిటీ సభ్యులు సవరణ చేసి తిరిగి పంపించాలంటూ తిరస్కరించారు. తర్వాత సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు స్టాండింగ్ కమిటీ సమావేశం జరగలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కొత్తగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగ్గా, అంతా కూటమి సభ్యులే ఎన్నికయ్యారు. అదేసమయంలో మెకానికల్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు బదిలీ జరగడంతో కొత్త అధికారి వచ్చారు. గతంలో స్టాండింగ్ కమిటీ వాయిదా వేసిన అంశంలో సాంకేతికంగా పరిష్కరించలేని లోపాలు ఉన్నాయని, అది పెడితే తాను ఇబ్బంది పడాల్సి ఉంటుందని సదరు అధికారి ఆ ఫైల్‌ను పక్కనపడేశారు. అయితే మూడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన మెకానికల్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మళ్లీ పాత ఫైల్‌ను బయటకు తీశారు. కాంట్రాక్టర్లు 50 వాహనాలు పెట్టకుండానే పెట్టినట్టు చూపించారని తెలిసినప్పటికీ సదరు అధికారి ఎందుచేతనో ఆ ఫైల్‌ను మార్చి నెలలో జరిగిన చివరి స్టాండింగ్ కమిటీ సమావేశంలో పెట్టి ర్యాటిఫికేషన్ చేయించినట్టు తెలిసింది. ఆయా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారుల ద్వారా అకౌంట్స్ విభాగానికి రెండు నెలల కిందట పంపించారు. అయితే ఒక కాంట్రాక్టర్ తాను చెత్త తరలింపునకు వినియోగించినట్టు పేర్కొన్న వాహనాల్లో బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల నంబర్లు ఉన్నట్టు తెలిసింది. ఇటీవల ఈ విషయం బయటపడింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’కి సమాచారం అందడంతో మెకానికల్, అకౌంట్స్ విభాగాల్లో ఆరా తీయగా, సంబంధిత కాంట్రాక్టర్ ఒకరు అధికారులు, సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం బయటకు ఇస్తే తన తడాఖా చూపిస్తానని బెదిరిస్తున్నట్టు తెలిసింది. దీనిపై కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టిసారిస్తే మెకానికల్ విభాగంలో జరుగుతున్న అవినీతి బయటపడుతుందని ఇంజనీరింగ్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.