భారీగా పోర్టు విస్తరణ
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:18 AM
విశాఖ నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న బొగ్గు, ఇతర సరుకుల ఎగుమతి, దిగుమతులను దశల వారీగా వేరే పోర్టుకు తరలిస్తామని ఇన్‌చార్జి చైర్మన్ ఎం.అంగముత్తు తెలిపారు.
రూ.3 వేల కోట్లతో లాజిస్టిక్స్ వసతులు
రూ.1,100 కోట్లతో రహదారుల విస్తరణ
కాలుష్య కారక వస్తువుల రవాణా కార్యకలాపాలు
విశాఖ నుంచి మూలపేట పోర్టుకు తరలింపు
విశాఖ పోర్టు ఇన్‌చార్జి చైర్మన్ ఎం.అంగముత్తు
విశాఖపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న బొగ్గు, ఇతర సరుకుల ఎగుమతి, దిగుమతులను దశల వారీగా వేరే పోర్టుకు తరలిస్తామని ఇన్‌చార్జి చైర్మన్ ఎం.అంగముత్తు తెలిపారు. పోర్టు వాటాదారులతో నోవాటెల్ హోటల్‌లో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, విశాఖపట్నం పోర్టు ఏర్పాటై 92 ఏళ్లు పూర్తయ్యిందని, నగరంతో పాటే పోర్టు కూడా అభివృద్ధి చెందిందన్నారు. విశాఖలో ప్రతి పౌరుడికి పోర్టుతో అనుబంధం ఉందని, దానిని కొనసాగించాలనేదే తమ ధ్యేయమన్నారు. పోర్టులో ఒక మిలియన్ టన్ను సరుకు రవాణా చేస్తే మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని, ఈ ఏడాది తాము 91 మిలియన్ టన్నులు హ్యాండిల్ చేశామన్నారు. వంద మిలియన్ టన్నులు లక్ష్యం పెట్టుకున్నామని, తద్వారా మరో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
నౌకా నిర్మాణ రంగంలోకి వెళుతున్నాం
విశాఖపట్నం పోర్టును భారీగా విస్తరిస్తున్నామని, ఇతర కార్యకలాపాల్లోకి కూడా వెళుతున్నామని అంగముత్తు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విశాఖలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న బొగ్గు, తదితర సరకులను ఆ పోర్టుకు తరలిస్తామని చెప్పారు. కొత్తగా నౌకా నిర్మాణ రంగంలోకి కూడా వెళుతున్నామని, దుగరాజుపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మించబోతున్నామన్నారు. విశాఖ పోర్టును దశల వారీగా సంప్రదాయ రీతిలో అభివృద్ధి చేస్తున్నామని, అందరికీ పోటీగా నిలుస్తున్నామన్నారు. పోర్టులో లాజిస్టిక్స్ కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రైల్వే పనులు, రహదారుల విస్తరణకు ఈ నిధులు ఉపయోగిస్తున్నామన్నారు. కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్, అక్కడి నుంచి సబ్బవరం వరకు రహదారులను భారీగా విస్తరిస్తున్నామని, వీటికే రూ.1,100 కోట్లు పెడుతున్నామన్నారు.
క్రూడాయిల్ హ్యాండ్లింగ్‌లో 25 శాతం వృద్ధి
గత ఏడాది 82.6 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగా ఈ ఏడాది అది 91.17 మిలియన్ టన్నులకు చేరిందన్నారు. ఒక్క పెట్రోలియం ఉత్పత్తులే 25శాతం పెరిగాయన్నారు. ఇంకా ఎరువులు 45 శాతం, ఐరన్‌ఓర్ 15 శాతం పెరిగాయన్నారు. నగరంలో పది లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికి నాలుగు లక్షల మొక్కలు నాటామని, మిగిలిన ఆరు లక్షలను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ రోశ్ని అపరాంజి, సెక్రటరీ శంకర్ బాబు పాల్గొన్నారు.