పూడిమడకలో భారీ భూ కబ్జా
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:43 AM
వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు భూకబ్జాలకు పాల్పడ్డారు.
వైసీపీ హయాంలో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూములు 22ఏ నుంచి తొలగింపు
దర్జాగా లేఅవుట్, ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్డు నిర్మాణం
ఉప్పుటేరుపై ప్రభుత్వ నిధులతో కల్వర్టు
మత్స్యకార నేతల ఫిర్యాదులు బుట్ట దాఖలు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఫిర్యాదులు
సర్వే చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు
ప్రభుత్వ భూములంటూ బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్న మండల అధికారులు
అచ్యుతాపురం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు భూకబ్జాలకు పాల్పడ్డారు. అధికార పలుకుబడితో 22ఏలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఆయా భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఈ వెంచర్లలోకి రాకపోకల కోసం ప్రభుత్వం భూముల్లో నుంచి 40 అడుగుల వెడల్పుతో రోడ్డు వేశారు. ఇంకా ఉప్పుటేరుపై కల్వర్టు నిర్మించారు. అప్పట్లో స్థానిక మత్స్యకార నాయకులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఫిర్యాదులు చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ జరపాలని అచ్యుతాపురం తహశీల్దారు కార్యాలయానికి ఇటీవల ఆదేశాలు వచ్చాయి. దీంతో కొన్ని సర్వే నంబర్లలోని భూముల్లో అధికారులు హెచ్చరిక బోర్డులు పాతి చేతులు దులుపుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లలో మాత్రం రహదారుల ఏర్పాటు పనులు జరుగుతూనే వున్నాయి. వైసీపీ నేతల భూ దందాకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.
పూడిమడక తీర ప్రాంతంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంలో ఉన్నాయంటూ మత్స్యకార నాయకులు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల క్రితం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) కోసం ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఈ సమయంలో భాగంగా పూడిమడక పంచాయతీ పరిధిలోని పలు సర్వే నంబర్లలో వున్న భూములను 22ఏలో చేర్చారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గం స్థాయి నేతల్లో ఒకరి కన్ను ప్రభుత్వ భూములపై పడింది. పూడిమడక సర్వే నంబరు 52లో 8.24 ఎకరాలు, 53లో 9.26 ఎకరాలు, 54లో 8.03 ఎకరాలు, 55లో నాలుగు ఎకరాలు వెరసి 29.53 ఎకరాలతో పాటు సర్వే నంబర్లు 82, 83ల్లో మరికొంత భూమిని ఆక్రమించారు. వీటిని 22ఏ జాబితా నుంచి తప్పించారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది మత్స్యకార నాయకులు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ భూములను పరిశీలించి, ప్రభుత్వానికి చెందినవిగా నిర్ధారించారు. అయితే అధికారంలో వున్నది వైసీపీ కావడంతో సదరు భూములను ఆక్రమించుకున్న నేత.. భూముల్లో వున్న సరుగుడు తోటలను నరికించి, భూమిని యంత్రాలతో చదును చేయించారు. ఈ భూములకు వెళ్లే దారిలో మధ్యలో ఉప్పుటేరు వుంది. దీనిపై ప్రభుత్వ నిధులతో కల్వర్టు నిర్మాణంం చేపట్టారు. అంతేకాక ఆక్రమించిన భూములకు రహదారి కోసం ప్రభుత్వ భూముల్లో నుంచి 40 అడుగుల వెడల్పుతో రోడ్డు వేశారు. వైసీపీ నేత భూకబ్జాలు, అక్రమాలపై అప్పట్లో మత్స్యకార నాయకులు, స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి తర్వాత మత్స్యకార నాయకులు మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతకు, కూటమిలోని ఒక పార్టీ నాయకులు అండగా వుండడంతో ఈ ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా.. మత్స్యకార నాయకులు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే వున్నారు. స్పందించిన ఉన్నతాధికారులు.. పూడిమడకలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారణ జరపాలని అచ్యుతాపురం తహశీల్దారును ఆదేశించారు. దీంతో సర్వే నిర్వహించి కొన్ని సర్వే నంబర్లలోని భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఉప్పుటేరుపై అక్రమంగా కల్వర్టు నిర్మించారంటూ దానిపై తహశీల్దారు పేరుతో కాగితం అంటించారు. అయితే అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయని భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ పనులు జరుగుతూనే వున్నాయి. లేఅవుట్‌లో అంతర్గత రోడ్లు వేయడంతోపాటు సర్వే నంబర్లను సైతం పేర్కొంటూ ప్లాట్ల నంబర్లతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.