Share News

భారీగా విద్యుత్‌ వినియోగం

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:56 AM

విద్యుత్‌ వినియోగం తగ్గించాలని వినియోగదారులకు తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) సీఎండీ పృథ్వీతేజ్‌ విజ్ఞప్తి చేశారు.

భారీగా విద్యుత్‌ వినియోగం

తగ్గించాల్సిందిగా వినియోగదారులకు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ విజ్ఞప్తి

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

విద్యుత్‌ వినియోగం తగ్గించాలని వినియోగదారులకు తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) సీఎండీ పృథ్వీతేజ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఉక్కపోత పెరిగిందని ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా విద్యుత్‌ వినియోగం చాలా ఎక్కువగా ఉందన్నారు. మండు వేసవిలో కూడా లేనంత డిమాండ్‌ ఇప్పుడు చూస్తున్నామన్నారు. సెప్టెంబరులో విద్యుత్‌ వినియోగం అన్ని రికార్డులను అధిగమించేసిందన్నారు. గతంలో ఎన్నడూ ఇంత వినియోగం లేదన్నారు. ఇది గ్రిడ్‌పై ప్రభావం చూపుతున్నదన్నారు. వాషింగ్‌ మెషీన్లు, ఈవీ చార్జింగ్‌ వంటివి అధిక విద్యుత్‌ను తీసుకుంటాయని, వాటిని పగటిపూట మాత్రమే వాడాలని, రాత్రివేళ ఉపయోగించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని, వినియోగం తగ్గించుకోవాలని కోరారు.


25న కొత్త జడ్పీలు ఏర్పాటు

అనకాపల్లిలోని జడ్పీ అతిథి గృహంలో జిల్లా పరిషత్‌ కార్యాలయం

అల్లూరి జడ్పీ కార్యాలయానికి భవనం కేటాయింపుపై సందిగ్ధం

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

కొత్త జిల్లాల కేంద్రంగా జిల్లా పరిషత్‌ కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. ప్రస్తుత జడ్పీ పాలక వర్గాల కాలపరిమితి ఈనెల 24వ తేదీతో ముగియనున్నది. ఆ మరుసటి రోజు అంటే 25వ తేదీన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జడ్పీ కార్యాలయాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. విశాఖలో ప్రస్తుతం ఉన్న కార్యాలయం నుంచి జడ్పీ పాలన కొనసాగుతుంది. కేవలం నాలుగు మండలాలే విశాఖ జడ్పీ పరిధిలో ఉంటాయి. అనకాపల్లి పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో జిల్లా పరిషత్‌ కార్యాలయం ఏర్పాటుకు అక్కడి అధికారులు అన్ని అనుమతులు ఇచ్చేశారు. అనకాపల్లి జడ్పీ పరిధిలో 24 మండలాలు ఉంటాయి. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో జడ్పీ కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటివరకూ భవనం కేటాయించలేదు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు వసతి కల్పించే బాధ్యత ఐటీడీఏలదే. పాడేరులో గల జడ్పీ అతిథి గృహంలో ఇప్పటికే డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయం ఉంది. అందువల్ల ప్రత్యామ్నాయంగా మరో భవనం కేటాయించాల్సి ఉంది. ఇదిలావుండగా కొత్త జడ్పీలు ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం...అధికారులు, సిబ్బంది కేటాయింపుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల కొత్త కార్యాలయాలు ఏర్పాటుజరిగినా సిబ్బంది, అధికారులు విభజనకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.


నగరానికి గ్రీన్‌ మెట్రో ఏసీ బస్సులు

గాజువాక చేరుకున్న మొదటి బస్సు

నెలాఖరుకు మరో 59 బస్సుల రాక

అక్టోబరు ఒకటి నుంచి సేవలు ప్రారంభం

ద్వారకా బస్‌స్టేషన్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

ప్రధానమంత్రి ఈ-బస్సు సేవా పథకంలో భాగంగా నగర ప్రయాణికులకు సేవలందించేందుకు గ్రీన్‌మెట్రో ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఒక బస్సు గాజువాక డిపోనకు చేరుకుంది. సోమవారం పది బస్సులు, నెలాఖరుకు మరో 19 బస్సులు వస్తాయని సమాచారం. అదేవిధంగా సింహాచలం డిపోనకు 40 గ్రీన్‌ మెట్రో ఏసీ బస్సులు రానున్నాయి. అక్టోబరు ఒకటి నుంచి ప్రయాణికులకు రవాణా సేవలందించేందుకు ఈ బస్సులను వినియోగిస్తామని ఆర్టీసీ విశాఖ ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు.


ఐటీ పార్కులో నీటి కొరత

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంతవరకూ సహకరించాలని ఏపీఐఐసీ లేఖ

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

నీటి సమస్య ఇప్పుడు ఐటీ కంపెనీలను కూడా తాకింది. రుషికొండ, మధురవాడ ఐటీ పార్కులో హిల్‌ నంబరు-2, హిల్‌ నంబర్‌ 3లపై సుమారు ఇరవై కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో ఐదు వేల మంది వరకు పనిచేస్తున్నారు. రెండు హిల్స్‌పై రెండు వాటర్‌ ట్యాంకులు నిర్మించి, బోర్లు వేసి వాటి ద్వారానే గత పదిహేనేళ్లుగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రత్యేకమైన పైపులైన్‌ గానీ, జీవీఎంసీ నుంచి నీటి సరఫరా గానీ లేవు. ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటడంతో గతంలో మాదిరిగా సరఫరా చేయలేకపోతున్నారు. దీనిపై ఏపీఐఐసీ అధికారులు ఐటీ కంపెనీలకు శుక్రవారం ఒక సందేశం పంపించాయి. రెండు బోర్లను రోజుకు 12 నుంచి 15 గంటలు మోటార్ల ద్వారా నడుపుతున్నామని, అయినా ఫలితం ఉండడం లేదని పేర్కొంది. బోర్ల ద్వారా తగినంత నీరు రావడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ఒక వారం రోజులు సహకరించాలని కోరింది. అంతవరకు నీటిని సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. తాము ఎప్పటినుంచో డెడికేటెడ్‌ పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా తాత్కాలిక ఏర్పాట్లే చేస్తామంటున్నారని ఐటీ కంపెనీల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.


పింఛన్లకు 43,420 దరఖాస్తులు

అందులో 21,275 మంది వృద్ధులు

5,267 మంది దివ్యాంగులు...

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

సామాజిక పింఛన్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పింఛన్‌ కోసం కొత్తగా 43,420 మంది దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తొలిసారిగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈనెల ఏడో తేదీ నుంచి 16వ తేదీ వరకు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చునని ప్రకటించింది. ఆ తరువాత మరో రెండు రోజులు గడువు పొడిగించారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం సాయంత్రంతో గడువు ముగిసింది. ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం సుమారు 43,420 దరఖాస్తులు అందాయి. అందులో అత్యధికంగా 21,275 మంది వృద్ధులు ఉన్నారు. ఇంకా దివ్యాంగులు 5,267 మంది, 1,593 మంది మత్స్యకారులు, 531 మంది గీత కార్మికులు, 477 మంది ఒంటరి మహిళలు, 250 మంది డప్పు కళాకారులు, 201 మంది చర్మ కార్మికులు, 54 మంది చేనేత కార్మికులు, 29 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,56,846 మందికి సామాజిక పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విచారణ చేపట్టి అర్హుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:56 AM