Share News

మహా అభివృద్ధి

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:03 AM

రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ రూపురేఖలు మరింతగా మారిపోనున్నాయి.

మహా అభివృద్ధి

నగరంలో రూ.3,547.19 కోట్లతో 13 ప్రాజెక్టులు

నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

రూ.725 కోట్లతో భీమిలి, తూర్పు నియోజవర్గాల్లో తాగునీరు ప్రాజెక్టులు

రూ.658 కోట్లతో మురుగునీటి వ్యవస్థ

రూ.117 కోట్లతో నగరమంతా స్కాడా

రూ.99.19 కోట్లతో నగరంలో ఏఐ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌

రూ.400 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు ప్రాజెక్టులు

విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ రూపురేఖలు మరింతగా మారిపోనున్నాయి. నగరంలో మౌలిక వసతులు మెరుగుపరచడంతోపాటు సుందరీకరణ, అభివృద్ధికి సంబంధించి జీవీఎంసీ ఎంపిక చేసిన రూ.3,547.19 కోట్ల విలువైన 13 పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఎంపీ ఎం.శ్రీభరత్‌ సోమవారం జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌తోపాటు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులతో కిర్లంపూడి లేఅవుట్‌లోని స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం మంగళవారం శంకుస్థాపన చేయబోయే అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించారు.

మధురవాడ, తూర్పు నియోజకవర్గ జోన్‌ల పరిధిలో తాగునీటి సరఫరా మెరుగు, కొత్త నెట్‌వర్క్‌ ఏర్పాటుకోసం అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) రూ.725 కోట్లతో చేపట్టే ప్రాజెక్టు గురించి కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాలతోపాటు, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ, కొమ్మాది, బక్కన్నపాలెం వంటి ప్రాంతాల్లో 35 వేల వరకు కొత్త కొళాయి కనెక్షన్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అలాగే నగరంలో నీటి సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంతోపాటు వినియోగంలో ప్రజల బాధ్యతను పెంచేందుకు రూ.117 కోట్ల అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌తో బల్క్‌, సెమీబల్క్‌ కనెక్షన్‌లకు అత్యాధునిక మీటర్లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల నీటి వినియోగంలో పారదర్శకత పెరిగి, వినియోగించిన నీటికి కచ్చితమైన బిల్లు వసూలు చేయడానికి వీలుంటుందన్నారు. అదేవిధంగా నగరంలో పారిశ్రామిక అవసరాలకు ప్రత్యేకంగా నవర ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నుంచి హెచ్‌పీసీఎల్‌ వరకు అమృత్‌ 2.0లో భాగంగా రూ.150 కోట్లతో పీపీపీ కింద పైప్‌లైన్‌ నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నగరంలో మురుగునీటి వ్యవస్థను అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చేందుకు అమృత్‌ 2.0 కింద రూ.400 కోట్లతో ఐదు పనులు చేయనున్నట్టు కమిషనర్‌ వివరించారు. రూ.446 కోట్లతో నార్త్‌ వెస్ట్‌, పెందుర్తి ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన నిరంతర నీటిసరఫరా ప్రాజెక్టును సీఎం ప్రారంభించబోతున్నారని దీనివల్ల ప్రయోజనం పొందే ప్రజల అభిప్రాయాలతో వీడియోను కమిషనర్‌ ఎంపీ భరత్‌కు చూపించారు. తూర్పు నియోజకవర్గం, మధురవాడ జోన్‌ పరిధిలో యూజీడీ నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో రూ.658 కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. గాజువాక, పెందుర్తి, అగనంపూడి జోన్‌ల పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపరిచేందుకు వీలుగా స్మార్ట్‌సిటీ నిధులు రూ.150 కోట్లు, రూ.452 కోట్లు వ్యయంతో చేపట్టే రెండు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు కమిషనర్‌ వివరించారు.

నగరంలో ట్రాఫిక్‌ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద వాహన చోదకులు వేచివుండే సమయం తగ్గించే లక్ష్యంతో నగర పోలీసులతో కలిసి రూ.99.19 కోట్ల వ్యయంతో చేపట్టే ఆపరేషన్‌ ‘సారథి’ ప్రాజెక్టుకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు కమిషనర్‌ వివరించారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో పనిచేసే నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద సీసీ కెమెరాలను పర్యవేక్షించడం కోసం రూ.65 కోట్లతో కొత్తగా సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు కమిషనర్‌ తెలిపారు. నగరంలో వీధి వ్యాపారుల సంక్షేమం, జీవనోపాధి కోసం మెప్మా ఆధ్వర్యంలో రూ.పది కోట్ల వ్యయంతో మధురవాడ, గాజువాక ప్రాంతాల్లో స్మార్ట్‌ వెండింగ్‌ జోన్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇవికాకుండా నగర పరిధిలోని ప్రజలకు మౌలిక సదుపాయాలను (రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటివి) హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో మెరుగుపరిచేందుకు రూ.400 కోట్లతో చేపట్టే పనులకు, రూ.92.53 కోట్లతో వీఎంఆర్‌డీఏతో కలిసి పార్కుల అభివృద్ధికి సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మధురవాడలోని వీ కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్టు కమిషనర్‌ వివరించారు. దీనిపై ఎంపీ శ్రీభరత్‌ సంతృప్తి వ్యక్తంచేస్తూ నగరంలో రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థ అమలుకు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌) సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు, సెంటర్‌ మీడియన్లు, కూడళ్లు, వీధి దీపాలు, ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్‌ స్ట్రీట్‌ డిజైన్‌ విధానాన్ని అమలుచేయాలని ఆదేశించారు.


రూ.47.49 కోట్ల వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టులు

వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూ.47.49 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారని చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ సోమవారం తెలిపారు. నగరంలో కొత్తగా 42 ఉద్యానవనాల అభివృద్ధికి రూ.35 కోట్లు, పెదగంట్యాడలో క్రీడా ప్రాంగణానికి రూ.9.09 కోట్లు, కైలాసగిరిపైకి రెండో రహదారి నిర్మాణానికి రూ.3.4 కోట్లు కేటాయించామన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 01:03 AM