ఉపాధి పనుల్లో భారీగా అవినీతి
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:37 PM
మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రూ.46.36 లక్షల నిధులను ఉపాధి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కాజేశారని, మరో రూ.82.21 లక్షలు దోచుకునేందుకు స్కెచ్ వేశారని ప్రజావేదికలో బట్టబయలైంది.
రూ.46.36 లక్షలు స్వాహా
మరో రూ.82.21 లక్షలు కాజేసేందుకు స్కెచ్
ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు
చేయని పనులు చేసినట్టు చూపించి బిల్లులు
అడ్డగోలుగా పేమెంట్లు.. నిబంధనలకు తూట్లు
ప్రజావేదికలో బట్టబయలు
నిధుల రికవరీతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం
డ్వామా పీడీ డాక్టర్ డీవీ విద్యాసాగర్
చింతపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రూ.46.36 లక్షల నిధులను ఉపాధి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కాజేశారని, మరో రూ.82.21 లక్షలు దోచుకునేందుకు స్కెచ్ వేశారని ప్రజావేదికలో బట్టబయలైంది.
స్థానిక మండల పరిషత్ మైదానంలో మంగళవారం డ్వామా పీడీ డాక్టర్ డీవీ విద్యాసాగర్ అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం వివిధ పంచాయతీల్లో జరిగిన అక్రమాలను ప్రజావేదికలో వెల్లడించింది. ప్రధానంగా కూలీల సంతకాలు లేకుండా వేతనాల చెల్లింపు, పనుల కొలతల్లో తేడాలు భారీగా బయటపడ్డాయి. నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా చెల్లింపులు జరిపారు. ప్రజావేదికలో అక్రమాలపై అధికారులు ప్రశ్నిస్తుంటే ఉపాధి ఉద్యోగులు నీళ్లు నమిలారు. నిబంధనలకు విరుద్ధంగా పేమెంట్లు చేసిన ఉద్యోగులు ఏ విధంగా చెల్లింపులు జరిగాయో తెలియదంటూ సమాధానం ఇవ్వడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
చింతపల్లి మండలం పరిధిలో 2024-25 వార్షిక సంవత్సరంలో 5,605 ఉపాధి పనులు జరిగాయి. ఈ పనులకు సంబంధించి కూలీల రూపంలో రూ.28.07 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ.87.28 కోట్లు.. మొత్తం రూ.36.801 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ పనులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీలు జరిగాయి. దీంతో అక్రమాలు బయటపడ్డాయి. కిటుముల పంచాయతీలో పాత సీసీ రోడ్డును కొత్తగా నిర్మించినట్టు చూపించి ఇంజనీరింగ్ అధికారుల ఎం-బుక్ రికార్డు, తీర్మానం లేకుండా రూ.1.78 లక్షలు ఉపాధి ఉద్యోగులు కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేశారు. గొందిపాకలు పంచాయతీలో 19 పనులకు సంబంధించి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకుండా రూ.16.8 వేలు నగదు చెల్లింపులు జరిగాయి. అదే పంచాయతీలో ఎం-బుక్ రికార్డు చేయకుండా బీటీ రోడ్డు నిర్మించినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి రూ.1.77 లక్షలు కాంట్రాక్టర్ అప్పన్న ఖాతాలో జమ చేశారు. చౌడుపల్లి పంచాయతీలో ఇంజనీరింగ్ అధికారుల ఎం-బుక్ రికార్డు, తీర్మానం లేకుండా జీఎస్‌బీ రహదారి నిర్మించినట్టు చూపించి రూ.1.35 లక్షలు నక్క వెంకట్ అనే కాంట్రాక్టర్ ఖాతాలో జమచేశారు. అదే పంచాయతీలో డ్రాగన్ ఫ్రూట్ తోటల్లో లేని నేమ్ బోర్డులను ఏర్పాటు చేసినట్టు చూపించి రూ.10,300 నగదు దోచుకున్నారు. అలాగే పాత చెక్ డ్యామ్‌కు మరమ్మతులు చేసినట్టుగా చూపించి రూ.1.17 లక్షలు కంప్యూటర్ ఆపరేటర్, ఏపీవో కలిసి కాంట్రాక్టర్ ఖాతాలో జమచేశారు. యర్రబొమ్మలు పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.11.12 లక్షలు ఎఫ్‌పీవో జనరేట్ చేశారు. రూ.3.71 లక్షలు టీఏ భర్త శివశంకర్ బ్యాంక్ ఖాతాలో జమచేశారు. పనులు జరగకుండా నిధులు మళ్లిస్తున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు మరో రూ.9.44లక్షల ఎఫ్‌పీవోని రద్దు చేశారు. లోతుగెడ్డ పంచాయతీలో పాత సీసీ రోడ్డును కొత్తగా నిర్మించినట్టు చూపించి ఇంజనీరింగ్ అధికారుల ఎం-బుక్ రికార్డు లేకుండా రూ.3.39లక్షలను స్వాహా చేశారు. ఈ విధంగా మండలంలోని 13 పంచాయతీల్లో 31 పనులు ఎం-బుక్ రికార్డు, తీర్మానాలు లేకుండా రూ.1.28 కోట్లు కాజేసేందుకు ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కలిసి అక్రమాలకు తెర తీశారు. సామాజిక తనిఖీ నాటికి రూ.46.36 లక్షల చెల్లింపులు జరిగిపోయాయి. ఈ నిధులను ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకున్నట్టు రుజువైంది. పెండింగ్‌లో ఉన్న మరో రూ.82.21 లక్షల నిధులు అక్రమార్కుల చేతిలోకి వెళ్లకుండా నిలుపుదల చేసేందుకు ఉపాధి హామీ పథకం అధికారులు చర్యలు ప్రారంభించారు. 13 పంచాయతీల్లో గరిష్ఠంగా తాజంగి పంచాయతీలో రూ.19.23 లక్షలు, కనిష్ఠంగా పెదబరడ పంచాయతీలో రూ.1.16 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ అక్రమాలపై ఏపీడీ, విజిలెన్సు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు పది రోజుల్లో విచారణ చేపట్టి నివేదిక రూపొందిస్తారని, నివేదిక ఆధారంగా ఉద్యోగుల నుంచి నిధులు రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని డ్వామా పీడీ డాక్టర్ డీవీ విద్యాసాగర్ తెలిపారు. విచారణ నివేదిక వచ్చే వరకు బాధ్యులైన ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తామన్నారు. ఈ ప్రజావేదికలో ఎంపీపీ కోరాబు అనుషదేవి, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, ఏపీడీ లాలం సీతయ్య, ఎంపీడీవో సీహెచ్ సీతామహాలక్ష్మి, ఏవీవో బాలాజీ, ఎస్‌ఆర్‌పీలు ఎస్.అచ్యుతరావు, సీహెచ్ అప్పారావు చిరంజీవి, డీఈఈ రఘునాథరావు నాయుడు, ఏఈఈలు బాల కిశోర్, లోకేశ్, ఎస్‌ఎస్‌పీ పింఛన్ ఏపీవో బి. కృష్ణారావు, ఏపీవో రాజు, పాల్గొన్నారు.