Share News

పరిహారం చెల్లింపులో భారీ అవినీతి

ABN , Publish Date - May 19 , 2026 | 12:02 AM

ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. స్థానికేతరులను కూడా నిర్వాసితులుగా చూపించి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించారు.

పరిహారం చెల్లింపులో భారీ అవినీతి
కలెక్టర్‌కు కృష్ణంపాలెం మాజీ సర్పంచ్‌ అందజేసిన ఫిర్యాదు

స్థానికేతరులను కూడా సెజ్‌ నిర్వాసితులుగా చూపించి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపు

అధికారుల సహకారంతో కొందరికి లబ్ధి

విచారణ జరపాలంటూ కలెక్టర్‌కు మాజీ సర్పంచ్‌ ఫిర్యాదు

అచ్యుతాపురం, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. స్థానికేతరులను కూడా నిర్వాసితులుగా చూపించి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించారు. దీనిపై విచారణ జరపాలని రాంబిల్లి మండలం కృష్ణంపాలెం మాజీ సర్పంచ్‌ కశిరెడ్డి అప్పలస్వామినాయుడు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల సరిహద్దుల్లో ఉన్న కృష్ణంపాలెంలో 2008లో భూసేకరణ జరిగింది. భూములు ఇచ్చిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం రాగానే సెజ్‌లో కర్మాగారాల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. దీంతో కృష్ణంపాలెం గ్రామాన్ని వెంటనే ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో అచ్యుతాపురం- రాంబిల్లి మండలాల్లో 22 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మంది సెజ్‌ నిర్వాసితులకు 500 ఎకరాల్లో దిబ్బపాలెం వద్ద సెజ్‌ పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో కృష్ణంపాలెం నిర్వాసితులకు కూడా పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించి మళ్లీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎందుకంటే 2008కి, ఇప్పటికి కుటుంబాలు పెరిగాయి. ఇదే అవకాశంగా అనర్హులను జాబితాలో చేర్చి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలను కూడా కేటాయించేశారు. దీంతో మాజీ సర్పంచ్‌ దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో 19 మంది కుటుంబ యజమానులతో పాటు ఏడుగురు మేజర్లకు కూడా పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించారని పేర్లు, వారు నివాసముంటున్న ప్రాంతాల వివరాలతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీఐఐసీ అధికారులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సేకరించిన కొన్ని వివరాల ప్రకారం అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో నివాసముంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి కృష్ణంపాలెంలో తనకు గృహం ఉందని అధికారుల సహకారంతో నమోదు చేయించుకొని తనతో పాటు తన కుమార్తె, కుమారుడు పేరున ఒక్కొక్కరికి రూ.8.98 లక్షలు చొప్పున పరిహారం తీసుకోవడంతో పాటు ఇటీవల దిబ్బపాలెంలో ముగ్గురు పేరున మూడు ప్లాట్లు తీసుకున్నారు. అలాగే మాకవరపాలెం మండలం శెట్టిపాలేనికి చెందిన వారి పేర్లు కూడా నిర్వాసితుల జాబితాలో చేర్చి పరిహారంతో పాటు ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేసేశారు. ఇదే విధంగా విశాఖపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం, గాజువాక, పరవాడ మండలం గొర్లివానిపాలెం, సబ్బవరం, పోతిరెడ్డిపాలేనికి చెందిన వారిని కూడా జాబితాలో చేర్చారు. ఇందులో గాజువాకకు చెందిన ఒక వ్యక్తి గత నాలుగేళ్లుగా జర్మనీలో, సబ్బవరానికి చెందిన ఒక వ్యక్తి గత ఐదేళ్లుగా బెంగళూరులో ఉంటున్నారు. మరో వ్యక్తికి అచ్యుతాపురం మండలం వెదురువాడలో మూడంతస్థుల భవనం ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉంది.

Updated Date - May 19 , 2026 | 12:02 AM