Share News

మహా అవినీతి

ABN , Publish Date - Jul 10 , 2026 | 01:00 AM

జీవీఎంసీ గతనెలలో నిర్వహించిన వేసవిక్రీడా శిబిరా ల్లో పాల్గొన్న క్రీడాకారులకు అందించాల్సిన టీషర్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మహా అవినీతి

టీషర్టుల పేరుతో కుంభకోణం

వేసవి క్రీడా శిబిరాల్లో అందించాల్సిన టీషర్టులు తాజాగా పంపిణీ

14 వేల టీ షర్టుల సరఫరాకు రూ.35 లక్షలతో టెండర్‌

హనీకాంబ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారుచేయాలని నిబంధన

నాశిరకం మెటీరియల్‌తో తయారీ

కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేందుకు అత్యుత్సాహం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ గతనెలలో నిర్వహించిన వేసవిక్రీడా శిబిరా ల్లో పాల్గొన్న క్రీడాకారులకు అందించాల్సిన టీషర్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిబిరాలకు హాజరైన క్రీడాకారులకు ఉచితంగా టీషర్టులు సరఫరా చేసేందుకు జీవీఎంసీ షార్ట్‌ టెండర్‌ పిలిచింది. శిక్షణ శిబిరాలు ముగిసి నెల దాటింది. తాజాగా వాటిని సరఫరా చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా వర్క్‌ఆర్డర్‌లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా నాశిరకం టీషీర్టులను సరఫరా చేశారని కోచ్‌లు ఆరోపిస్తున్నారు.

నగర పరిధిలో ఎనిమిది నుంచి 16 ఏళ్లలోపు విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచడం, నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంతో జీవీఎంసీ ఏటా వేసవిసెలవుల్లో క్రీడా శిబిరాలను నిర్వహిస్తుంది. దీనివల్ల విద్యార్థులు సెలవులను సద్వినియోగం చేసుకుంటారనేది అధికారుల భావన. ఈ ఏడాది కూడా క్రీడా శిబిరాలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించినా ఆ తరువాత విరమించుకున్నారు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు, క్రీడాసంఘాల ఒత్తిడితో శిబిరాల నిర్వహణకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, ప్రత్యేక అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ అంగీకరించారు. అయితే పాఠశాలలు తిరిగి తెరుచుకునే సమయం సమీపించడంతో మే 25 నుంచి జూన్‌ ఆరు వరకు కేవలం పదిరోజులు శిబిరాలు ఏర్పాటుచేశారు. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, చెస్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, యోగా తదితర 41 క్రీడాంశాల్లో 486 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. సుమారు 12,036 మంది తమ పేర్లు నమోదుచేయించుకున్నారు. వారందరికీ జీవీఎంసీ లోగోతో కూడిన టీషర్టులను ఉచితంగా అందజేయాలని నిర్ణయించి 14వేల టీషర్టుల సరఫరాకు రూ.35 లక్షలతో టెండరు పిలిచారు. టీషర్టులు తప్పనిసరిగా ‘హనీ కాంబ్‌ ఫ్యాబ్రిక్‌’తో తయారుచేయాలని నిబంధన విధించారు. ఇవి క్రీడాకారులు సాధనచేసినపుడు చెమటను త్వరగా పీల్చుకుంటాయని, గాలి బాగా తగలడంతో పాటు మన్నిక ఎక్కువ ఉంటుందని, కాంట్రాక్టర్‌కు ఇచ్చిన వర్క్‌ఆర్డర్‌లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అంతా అయ్యాక

క్రీడా శిబిరాలు ముగిసిపోయినప్పటికీ కాంట్రాక్టర్‌ టీషర్టులను సరఫరా చేయలేదు. ఇటీవల వాటిని క్రీడాసంఘాలతో పాటు శిబిరాల్లో కోచ్‌లుగా వ్యవహరించిన వారికి అందజేశారు. ఒక్కో కోచ్‌కు వంద నుంచి ఐదు వందల వరకు టీషర్టులను సరఫరా చేసి, వాటిని క్రీడాకారులకు అందజేయాలని సూచించడంతో వారంతా అవాక్కయ్యారు.

నాశిరకం మెటీరియల్‌

హనీకాంబ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన టీషర్టులను సరఫరా చేయాలని వర్క్‌ఆర్డర్‌లో పేర్కొన్నప్పటికీ ఊరూ...పేరులేని నాశిరకం టీషర్టులను సరఫరా చేశారని కోచ్‌లు చెబుతున్నారు. వాటిని క్రీడాకారులు ధరించి సాధన చేస్తే గాలితగలదని, చెమట పీల్చుకునే పరిస్థితి లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతారని చెబుతున్నారు. నాణ్యత లేకపోవడంతో త్వరగా పాడైపోతాయని అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుంటే శిబిరాలు జరుగుతున్నపుడు లేదంటే కనీసం ముగింపు వేడుకల్లో సర్టిఫికెట్లతో పాటు టీషర్టులు అందిస్తే జీవీఎంసీకి ప్రచారం రావడంతోపాటు క్రీడాకారులకు ఉపయోగపడేవని, ఇప్పుడు వాటిని ఎలా అందజేస్తామని ప్రశ్నిస్తున్నారు.

బిల్లుపై అత్యుత్సాహం

వర్క్‌ఆర్డర్‌లో నిబంధనకు విరుద్ధంగా నాశిరకం టీషర్టులను పంపిణీ చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా బిల్లు చెల్లించేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా టీషర్టులు సరఫరా చేసిన తర్వాత వాటినాణ్యత, వర్క్‌ ఆర్డర్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అని థర్డ్‌పార్టీ క్వాలిటీకంట్రోల్‌ ఏజెన్సీతో పరిశీలించాలి. ఆ నివేదిక ఆధారంగా బిల్లు చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇవేవీలేకుండానే ఆగమేఘాలపై బిల్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ దృష్టిసారిస్తే ఆలస్యంగా టీషర్టుల పంపిణీ, నాశిరకం మెటీరియల్‌ వాడకం, తదితర లొసుగులు బయటపడతాయని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 01:00 AM