గూగుల్ శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:34 AM
ఆనందపురం మండలం తర్లువాడలో ఈనెల 28వ తేదీన జరగనున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి అధికారులు భారీఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 50వేల మందితో సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గూగుల్ కంపెనీ ప్రతినిధులు హాజరవుతున్నారు.
28న 50 వేల మందితో సభ
వెయ్యి బస్సులు సిద్ధం
బాకూరుపాలెం నుంచి గూగుల్ భూమి వరకు 60 అడుగుల రోడ్డు నిర్మాణం
సభ ఏర్పాట్లు పరిశీలించిన అఽధికారులు
విశాఖపట్నం/ఆనందపురం,
ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం తర్లువాడలో ఈనెల 28వ తేదీన జరగనున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి అధికారులు భారీఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 50వేల మందితో సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గూగుల్ కంపెనీ ప్రతినిధులు హాజరవుతున్నారు. జన సమీకరణకు సుమారు వెయ్యి బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఈ సభను భారీగా నిర్వహించడం ద్వారా భారీ పెట్టుబడులకు రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉందనే విషయం పారిశ్రామిక సంస్థలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో నీలకుండీలు-విజయనగరం రోడ్డు నుంచి బాకూరుపాలెం-తర్లువాడ రోడ్డును 60 అడుగులకు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం తర్లువాడ వరకు ఉన్న రోడ్డును గ్రామంలో గల స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ వరకూ పొడిగిస్తారు. అదేవిధంగా హెలిప్యాడ్ ఏర్పాటుకు బుధవారం అధికారులు పలు ప్రాంతాలు పరిశీలించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రాంగణం హెలిప్యాడ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా తర్లువాడలో సేకరించిన 316 ఎకరాల్లో 266.6 ఎకరాలు గూగుల్‌కు, మిగిలిన 51 ఎకరాలను పలు సంస్థలకు కేటాయించనున్నారు. ప్రస్తుతానికి గూగుల్‌కు 266.6 ఎకరాలు కేటాయించడంతో అక్కడ భూమి చదునుచేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మిగిలిన 51 ఎకరాలను ఏపీఐఐసీ అభివృద్ధి చేయనున్నది. కాగా నీలకుండీల నుంచి విజయనగరం వెళ్లే రోడ్డును 150 అడుగులకు విస్తరించాలని ఇప్పటికే వీఎంఆర్‌డీఎ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచింది. పారిశ్రామిక సంస్థలు వస్తున్నందున ఈ రోడ్ కూడా వేగంగా అభివృద్ధి చేయనున్నారు.
తర్లువాడలో గూగుల్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడెక్కడ భూములు కేటాయించాలన్న అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారు. గూగుల్ డేటా సెంటర్, ఇతర సంస్థల కోసం 316 ఎకరాలు కేటాయించారు. భూములు ఇచ్చిన రైతులకు 30 ఎకరాలు కేటాయించారు. దీనికి సంబంఽఽధించి క్షేత్రస్థాయిలో మార్కింగ్ చేశారు.