Share News

భోగాపురానికి జన సమీకరణ

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:21 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి 65 వేల మందిని సమీకరించనున్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి సుమారు పది వేల చొప్పున తరలించడానికి మొత్తం 1,400 బస్సులు ఏర్పాటుచేస్తున్నారు.

భోగాపురానికి  జన సమీకరణ

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి

జిల్లా నుంచి 65,000 మంది

1,400 బస్సులు ఏర్పాటు

బస్సులోనే స్నాక్స్‌ పంపిణీ

జిల్లా నేతలతో మంత్రుల సమన్వయం

విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి 65 వేల మందిని సమీకరించనున్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి సుమారు పది వేల చొప్పున తరలించడానికి మొత్తం 1,400 బస్సులు ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీతోపాటు ప్రైవేటు బస్సులు సమీకరించనున్నారు. ఒక్కొక్క బస్సులో 40 నుంచి 50 మందిని పంపనున్నారు. అందరికీ బస్సు బయలుదేరే పాయింట్‌ వద్ద ఆహారం అందజేస్తారు. ప్రతి ఒక్కరికీ టమాటా బాత్‌, రెండు వాటర్‌ బాటిల్స్‌, అరటిపండు, బిస్కెట్లతో కూడిన ప్యాకెట్లు సిద్ధం చేయడానికి కేటరింగ్‌ కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చారు. ఆహార ప్యాకెట్ల తయారీ, పంపిణీ బాధ్యత డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, డీఎస్‌వో వి.భాస్కర్‌కు అప్పగించారు. ప్రతి బస్సుకు సచివాలయ సిబ్బందిని ఇన్‌చార్జులుగా నియమిస్తారు. జిల్లా నుంచి జనాలను తరలించడానికి కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ నేతృత్వంలో ఇప్పటికే పలు కమిటీలు వేశారు. ప్రతి కమిటీకి పలు రకాల బాధ్యతలు అప్పగించారు. ఇదిలావుండగా జనాల తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లాలో ఎమ్మెల్యేలు, నేతలకు ఫోన్‌ చేసి జన సమీకరణకు సూచనలు చేశారు. కాగా ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 31వ తేదీన నగరానికి వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు ఆగస్టు ఒకటో తేదీ ఉదయం నేరుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Updated Date - Jul 30 , 2026 | 01:21 AM