Share News

శారదానదిలో దూకి వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:15 PM

పట్టణంలోని శారదానదిలో దూకి ఆదివారం ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుందని పట్టణ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపారు.

శారదానదిలో దూకి వివాహిత ఆత్మహత్య
భారతి మృతదేహం

అనకాపల్లి టౌన్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శారదానదిలో దూకి ఆదివారం ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుందని పట్టణ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సత్యనారాయణపురం ఉగ్గినవీధికి చెందిన మొలుగు వెంకటలక్ష్మి కుమార్తె భారతి(20)కి పెదగంట్యాడకు చెందిన పల్లం నాగేంద్రతో ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. అయితే భారతి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. పండుగ తరువాత డాక్టర్‌కు చూపించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఈ నెల 15వ తేదీన పండుగ నిమిత్తం భర్తతో కలిసి భారతి పుట్టింటికి వెళ్లింది. ఆమె భర్త రెండు రోజులు ఇక్కడే ఉండి శనివారం స్వగ్రామం పెదగంట్యాడకు వెళ్లాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం భారతి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. అలా వస్తూ శారదానది పాత వంతెన పైనుంచి నదిలోకి దూకింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఈ సంఘటనను చూసి వెంటనే నదిలో దూకి ఆమెను బయటకు తీశాడు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు కూడా హుటాహుటిన శారదానది ఒడ్డుకు వెళ్లి సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె మృతి చెందినట్టు వారు గుర్తించారు. ఈ సంఘటనపై మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాన్ని ఎన్టీఆర్‌ వైద్యాలయంలోని మార్చ్యురీకి తరలించామన్నారు. సోమవారం తహశీల్దార్‌ ఆధ్వర్యంలో పంచనామా జరిపిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Jan 18 , 2026 | 11:15 PM