Share News

మార్కెటింగ్‌ శాఖ మాయ

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:39 AM

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు వారు అనుకున్నట్టుగానే అస్మదీయులకు రైతుబజార్లలో పోస్టులు ఇచ్చుకున్నారు.

మార్కెటింగ్‌ శాఖ మాయ

  • అస్మదీయులకే రైతుబజార్లలో పోస్టులు

  • విధుల్లోకి ముగ్గురు ఎస్టేట్‌ అధికారులు, ఆరుగురు సూపర్‌వైజర్లు

  • వ్యవసాయ శాఖ ‘పెద్దలు’ చెప్పిన వారికే అవకాశం

  • రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణలు

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు వారు అనుకున్నట్టుగానే అస్మదీయులకు రైతుబజార్లలో పోస్టులు ఇచ్చుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా సరే ఎటువంటి జంకుగొంకూ లేకుండా ఎంపికైన అభ్యర్థులను గురువారం గోపాలపట్నంలో మార్కెటింగ్‌ శాఖ కార్యాలయానికి పిలిపించుకుని, శుక్రవారం నుంచి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ గత నెలలో పూర్తయిందని, ఇప్పుడు జాయినింగ్‌ ఆదేశాలు ఇస్తున్నామని అధికారులు సమర్థించుకుంటున్నారు.

జిల్లాలో మూడు ఎస్టేట్‌ అధికారుల పోస్టులు, పది సూపర్‌వైజర్‌ పోస్టులకు గత నెల మొదటి వారంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. రైతుబజార్లలో ఏ చిన్న అంశానికైనా జాయింట్‌ కలెక్టర్‌ ద్వారా పత్రికా ప్రకటనలు ఇచ్చే ఈ అధికారులు పదమూడు పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడి రైతుబజార్లన్నీ ఆర్థికంగా బాగున్నాయని, సిబ్బందికి జీతాలు ఇచ్చుకునే స్థాయిలో ఉన్నాయని పేర్కొంటూ ఈ పోస్టుల భర్తీకి నడుంకట్టారు. దీనికి సంబంధించిన ప్రకటనకు మాత్రం డబ్బులు లేవని ప్రధాన పత్రికలకు కాకుండా ఒక పత్రికలో చిన్న ప్రకటన ఇచ్చి ‘మమ’ అనిపించారు. అందులో కూడా ఎన్ని పోస్టులు, ఏ పోస్టుకు ఎంత జీతం?, వాటిని ఏ రిజర్వేషన్‌ ప్రకారం భర్తీ చేస్తున్నారు?...అనే విషయాలు వెల్లడించలేదు. మహిళలకు ఎన్ని?, ఎస్‌సీలు, ఎస్‌టీలకు ఎన్ని?...అనేది పేర్కొనలేదు. గుట్టుచప్పుడు కాకుండా ఆ శాఖకు చెందిన పెద్దల ప్రాంతానికి చెందిన మనుషులను గోపాలపట్నం కార్యాలయానికి రప్పించుకుని నేరుగా ఇంటర్వ్యూలు చేశారు. దీనిపై గత నెల ‘ఆంధ్రజ్యోతి’ రెండు రోజులు వరుస కథనాలు రాసినా అధికారులు స్పందించలేదు. ఒక్కో పోస్టును రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థులను ఎంపిక చేసేశామని, జాబితా విజయవాడలోని రైతుబజార్ల సీఈఓకు పంపించామని, అక్కడి నుంచి ఉద్యోగాలు పొందిన వారి జాబితా వస్తుందని పేర్కొన్నారు. అక్టోబరు మొదటి వారంలోనే వారంతా ఉద్యోగాల్లో చేరతారని ప్రకటించారు. కానీ ఎందుకనో వెనక్కి తగ్గారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వచ్చాక గుట్టుచప్పుడు కాకుండా వారిలో తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ముగ్గురు ఈఓలు, ఆరుగురు సూపర్‌వైజర్లను పిలిచి శుక్రవారం నుంచి విధుల్లో చేరాల్సిందిగా ఆదేశించారు. ఈ ఎంపికైన జాబితా కూడా పత్రికలకు విడుదల చేయలేదు. ఎంపికైన వారిలో అత్యధికులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారనే ఆరోపణలు ఉన్నాయి. నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు ఎలా ఇచ్చారనేది అర్థం కావడం లేదు. ఈ నియామకాలపై మార్కెటింగ్‌ శాఖాధికారులు మొదటి నుంచి నోరు విప్పడం లేదు. పూర్తి వివరాలు వెల్లడించడం లేదు.

Updated Date - Oct 17 , 2026 | 01:39 AM