Share News

మార్కెట్‌ యార్డులు నిర్వీర్యం

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:41 AM

రైతులకు అండగా నిలవాల్సిన మార్కెట్‌ యార్డులు నిరుపయోగంగా మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నప్పటికి రైతులు ఆశించిన ప్రయోజనాలు కలగడం లేదన్న విమర్శలున్నాయి.

మార్కెట్‌ యార్డులు నిర్వీర్యం
నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డు

- గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం

- అమలుకు నోచుకోని రైతు బంధు పథకం

- సెస్సు వసూళ్లలోనూ వెనుకంజ

నర్సీపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రైతులకు అండగా నిలవాల్సిన మార్కెట్‌ యార్డులు నిరుపయోగంగా మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నప్పటికి రైతులు ఆశించిన ప్రయోజనాలు కలగడం లేదన్న విమర్శలున్నాయి.

గతంలో మార్కెట్‌ యార్డులు అంటే రైతులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేవారు. రైతు బంధు పథకంలో రైతు ఉత్పత్తులు గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాముల్లో భద్రపరుచుకుంటే ఆరు నెలల వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు. గ్రామాలకు అంతర్గత రోడ్లు, పశు వైద్య శిబిరాలు నిర్వహించేవారు. ఎరువులు, విత్తనాలు లాభాపేక్ష లేకుండా విక్రయించేవారు. రైతులకు ఉపయోగపడే అటువంటి పథకాలు ప్రస్తుతం అమలుకు నోచుకోవడం లేదు.

అమలుకు నోచుకోని రైతు బంధు

జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగుల నియోజకవర్గాల్లో వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క ఏఎంసీకి రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించింది. విధి విధానాలు ప్రకటించకపోవడంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా అమలుకు నోచుకోలేదు. గతంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌ యార్డుల్లోని గోదాముల్లో భద్ర పరిచుకునే వారు. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత రైతులు విక్రయించుకునే అవకాశం ఉండేది. ఏఎంసీలు ద్వారా రైతు బంధు పథకంలో వడ్డీ లేని రుణాలు మంజూరు చేసేవారు. ఉత్పత్తులు విక్రయించుకున్న తర్వాత రుణాలు చెల్లించేవారు. గత పదిహేనేళ్లుగా రైతు బంధు పథకం అమలు కావడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు చేసి, విధి విధానాలు ప్రకటించకపోవడంతో ఈ ఏడాది నిరుపయోగంగా మారింది.

సెస్సు వసూళ్లలో కూడా వెనుకంజ

మార్కెట్‌ యార్డుల్లో సెస్సు వసూళ్లు తప్పితే ఇతర ఏ విధమైన రైతు సంక్షేమ పథకాలు అమలు జరగక పోగా, వార్షిక లక్ష్యాలు సాధించడంలో పాయకరావుపేట ఏఎంసీ తప్పితే మిగిలిన అన్ని ఏఎంసీలు లక్ష్య సాధనలో వెనుకంజలో ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 16 వరకు సెస్సు వసూళ్ల లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి మార్కెట్‌ యార్డులో 2025-26లో సెస్సు వసూళ్లు లక్ష్యం రూ.185 లక్షలు లక్ష్యం కాగా, రూ.119.27 లక్షలు మాత్రమే వసూలు చేశార1ు. నర్సీపట్నం ఏఎంసీ లక్ష్యం రూ.207 లక్షలకు రూ.131.02 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఎలమంచిలి ఏఎంసీలో రూ.225 లక్షలకు రూ.117.55 లక్షలు, చోడవరం ఏఎంసీలో రూ.106 లక్షలకు రూ.59.72 లక్షలు, మాడుగులలో రూ.60లక్షలకు రూ.31.98 లక్షలు వసూలు చేసి లక్ష్య సాధనలో చతికల పడ్డారు. పాయకరావుపేట ఏఎంసీ మాత్రం రూ.184 లక్షలకు రూ.166.18 లు 90 శాతానికి పైగా మార్కెట్‌ సెస్సు వసూలు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.

ఒక్కో ఏఎంసీ పరిధిలో రెండు పశు వైద్య శిబిరాలు

జిల్లాలో ఏఎంసీల ద్వారా పశు వైద్య శిబిరాలు నిర్వహించడానికి ప్రభుత్వం రూ.30 వేలు చొప్పున బడ్జెట్‌ కేటాయించిందని మార్కెటింగ్‌ శాఖ ఏడీ అశోక్‌కుమార్‌ తెలిపారు. మార్చిలోగా ఒక్కొక్క ఏఎంసీ పరిధిలో రెండేసి పశువైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఒక్కొక్కదానికి రూ.15 చొప్పున నిధులు ఖర్చు చేయాలని తెలిపారు. రైతు బంధు పథకానికి రూ.20 లక్షలు చొప్పున ఆరు ఏఎంసీలకు బడ్జెట్‌ కేటాయించారని, విధి విధానాలు ప్రకటించలేదని ఆయన తెలిపారు.

Updated Date - Feb 23 , 2026 | 12:41 AM