వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:39 AM
అనారోగ్య సమస్య, మానసిక వేదనతో ఒక వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కోర్టుపేట రోడ్డులో శనివారం చోటుచేసుకుంది.
ఎలమంచిలి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య సమస్య, మానసిక వేదనతో ఒక వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కోర్టుపేట రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎలమంచిలి పట్టణ ఎస్‌ఐ సావిత్రి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఎలమంచిలి మునిసిపాలిటీ యర్రవరం పరిధి కోర్టు రోడ్డులో అద్దె ఇంట్లో మేడిశెట్టి రాధిక(40), భర్త శ్రీనాథ్ శ్రీనివాసరావు, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటోంది. గత ఎనిమిదేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విశాఖపట్నంలో వైద్య సేవలు పొందుతోంది. వేరే ప్రాంతంలో చదువుతున్న ఇద్దరు కుమార్తెలు పండుగ సెలవులకు శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో గది బయట గడియ పెట్టి రాధిక శనివారం వేకువజామున డాబాపైకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి మాడుగుల మండలం సురవరం గ్రామానికి చెందిన బాబూరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. కాగా సెలవులకు వచ్చిన పిల్లలతో సరదాగా పండుగ జరుపుకుందామనుకుంటున్న సమయంలో ఈ విధంగా జరిగిందని ఆమె భర్త విలపించారు.