పర్యాటకాభివృద్ధికి మెరీనా
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:49 AM
తీర ప్రాంతాల పర్యాటకాభివృద్ధిలో పోర్టులు భాగస్వాములు కావాలని కేంద్రం చేసిన సూచనతో విశాఖపట్నం పోర్టు ‘మెరీనా’ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది.
తీరంలో తేలికపాటి బోట్లు నిలుపుకునేందుకు అనుగుణంగా నిర్మాణం
వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్, కేఫ్, రిక్రియేషన్, వాటర్ స్పోర్ట్స్...
విశాఖ పోర్టు ప్రణాళికలు
ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తీర ప్రాంతాల పర్యాటకాభివృద్ధిలో పోర్టులు భాగస్వాములు కావాలని కేంద్రం చేసిన సూచనతో విశాఖపట్నం పోర్టు ‘మెరీనా’ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక ప్రణాళికల్లో తగిన సహకారం అందించడానికి ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు రావాలని ప్రకటన జారీచేసింది.
సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 2030 నాటికి తీరప్రాంతాలు ఆర్థికంగా బలోపేతం కావాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని, పర్యాటకంగా అన్ని వసతులు సమకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే విశాఖపట్నం పోర్టు ముందుగా రూ.100 కోట్ల వ్యయంతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం చేపట్టింది. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ ప్రయాణికుల రాకపోకలకు వీలుగా దీనిని అభివృద్ధి చేసింది. దానిని ఆనుకొనే 600 మీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ ప్రొమెనేడ్ ఇటీవల నిర్మించింది. పోర్టులోకి రాకపోకలు సాగించే నౌకలను నగర ప్రజలు, పర్యాటకులు దగ్గరుండి వీక్షించేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు. ఇంకా ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. వీటికి అదనంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెరీనా కూడా నిర్మించాలనేది మరో ప్రణాళిక.
మెరీనా అంటే...
తీర ప్రాంతంలో తేలికపాటి బోట్లు నిలుపుకొనేందుకు వీలుగా చేపట్టే నిర్మాణాన్ని మెరీనా అంటారు. అక్కడ బోట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉంటాయి. తెరచాప పడవలు, పాంటూన్లు అక్కడ నిలుపుకోవచ్చు. తీరప్రాంత పర్యాటకాభివృద్ధికి అవసరమైన వాటర్ ఫ్రంట్ రెస్టారెంట్, కేఫ్, రిక్రియేషన్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఉంటాయి.
మూడు ప్రాంతాల ఎంపిక
విశాఖపట్నం పోర్టు ఈ మెరీనా నిర్మాణానికి మూడు ప్రాంతాలను ప్రతిపాదించింది. అందులో ఏది సానుకూలంగా, లాభదాయకంగా ఉంటుందో కన్సల్టెంట్ సూచిస్తే అక్కడ నిర్మాణం చేపడతారు. డాల్ఫిన్స్ నోస్ పక్కన, వుడా పార్కు వద్ద గల లైట్‌హౌస్, మత్స్యకారులు చిన్న బోట్లు నిలుపుకొనే ప్రాంతాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వీటిలో ఏది అనుకూలమని భావిస్తే అక్కడ ఏర్పాటు చేస్తారు. తెరచాప పడవలు నిలుపుకొనేందుకు ఫ్లోటింగ్ బెర్తులు సరిపోతాయా? ఫిక్స్‌డ్ నిర్మించాలా? అనేది కూడా సూచించాలని పోర్టు యాజమాన్యం కోరింది. మార్కెట్ కూడా అధ్యయనం చేసి, పోటీ ఎలా ఉంటుంది? మెరీనా నిర్మాణానికి డ్రెడ్జింగ్ అవసరమా? లేదా? హైడ్రోగ్రాఫిక్ సర్వే వంటివి చేయాలని కోరింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తామని పోర్టు వర్గాలు తెలిపాయి.
బే సిటీకి సమగ్ర ప్రణాళిక
అధికారులకు కలెక్టర్ ఆదేశం
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)లో భాగంగా అభివృద్ధి చేస్తున్న బే సిటీ ప్రాజెక్టుకు సంబంధించి భూవినియోగం, ల్యాండ్ పార్శిల్స్ గుర్తింపు, మౌలిక వసతులు, పర్యాటక ప్రాజెక్టులు, తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులకు ఆదేశించారు. వీఈఆర్‌పై శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు భూములను వేర్వేరుగా గుర్తించి వాటి విస్తీర్ణం, ప్రస్తుత వినియోగం, యాజమాన్య స్థితి, అభివృద్ధి అవకాశాలు, తదితర అంశాలతో పక్కాగా సమాచారం సిద్ధం చేయాలన్నారు. బే సిటీని ఎకనామిక్ రీజియన్‌తో అనుసంధానం చేసేలా కనెక్టివిటీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పర్యాటకం, గేమింగ్, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో జేసీ జి.విద్యాధరి, వీఎంఆర్‌డీఎ కమిషనర్ తేజ్‌భరత్, ఎస్టేట్ అధికారి బి.దయానిధి, భీమిలి ఆర్డ్డీవో సంగీత్‌మాథుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరోనాపై అప్రమ్తతం
లక్షణాలుంటే తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలని వైద్య శాఖ ఆదేశాలు
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులతోపాటు కరోనా సంబంధిత లక్షణాలతో వచ్చే వారికి పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించాలని ప్రాథమిక ఆరోగ్య, అర్బన్ హెల్త్ సెంటర్‌లకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు ఆదేశాలు జారీచేశారు. తీవ్రమైన జ్వరంతోపాటు ఇతర లక్షణాలుంటే నమూనాలు సేకరించి కేజీహెచ్‌లోని వీఆర్‌డీఎల్ ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. ఇకపోతే, కేసులు పెరిగితే పరీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో 18 పడకలతో కొవిడ్ ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామని డైరెక్టర్ డా.మన్మథరావు తెలిపారు. కరోనాపై భయం వద్దని అన్నిరకాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.