పాఠశాలల పరిసరాల్లో గంజాయి అమ్మకాలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:35 AM
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థులకు గంజాయిని అలవాటు చేసి వారిని మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఒకటి, రెండు, ఆరు, ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యా శాఖపై జరిగిన చర్చలో అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు మాట్లాడుతూ తమ మండలంలో ఒక ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కొందరు గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు.
- స్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీటీసీ సభ్యుల ఆందోళన
- పిల్లలను రవాణాకు కూడా ఉపయోగించుకుంటున్నారని ఆరోపణ
- గట్టి నిఘా పెట్టాలని మూడు జిల్లాల విద్యాశాఖాధికారులకు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆదేశం
- రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను విజయనగరం కాకుండా విశాఖ తరలించాలని కోరిన అనంతగిరి, అరకులోయ జడ్పీటీసీ సభ్యులు
- తమ చేతిలో లేదన్న అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిపై అసంతృప్తి
విశాఖపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థులకు గంజాయిని అలవాటు చేసి వారిని మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఒకటి, రెండు, ఆరు, ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యా శాఖపై జరిగిన చర్చలో అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు మాట్లాడుతూ తమ మండలంలో ఒక ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కొందరు గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను మాయమాటలు చెప్పి వారితో గంజాయి రవాణా చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాల వేళల్లో విద్యార్థులు బయటకు వస్తున్నారని...వార్డెన్, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేదని ఆరోపించారు. అరకులోయ, మునగపాక, దేవరాపల్లి, గొలుగొండ జడ్పీటీసీ సభ్యులు శెట్టి రోష్ని, పీఎస్ సత్యనారాయణ, కర్రి సత్యం, గిరిబాబులు మాట్లాడుతూ విద్యార్థులను కొందరు మత్తు పదార్థాల వినియోగం వైపు తీసుకువెళ్లడం హేయమైన చర్య అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. సభ్యుల ఆందోళనపై జడ్పీ చైర్‌పర్సన్ స్పందిస్తూ, పాఠశాలల పరిసరాల్లో గట్టి నిఘా పెట్టాలని మూడు జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. తప్పుచేసిన విద్యార్థులను గట్టిగా మందలిస్తే తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి ఉపాధ్యాయులతో గొడవకు దిగడం మంచి విధానం కాదన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను అదుపులో పెట్టాలన్నారు. పాఠశాలల్లో ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. చర్చకు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు బదులిస్తూ అన్ని పాఠశాలల్లో గంజాయికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి, ఈగల్ క్లబ్‌లు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి పాఠశాల వద్ద నిఘా పెంచాలని పోలీసులను కోరతామని, విద్యార్థుల కదలికలపై నిఘా ఉంచేలా ఉపాధ్యాయులకు కూడా ఆదేశాలు ఇస్తామన్నారు. అనంతగిరి, అరకులోయ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్టయితే బాధితులను ఎస్.కోట, అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళుతున్నారని...ఒకవేళ చికిత్స పొందుతూ చనిపోతే అక్కడ నుంచి ఏజెన్సీకి తీసుకురావడం ఇబ్బంది అవుతోందని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్యపై అరకు జడ్పీటీసీ సభ్యురాలు రోష్ని మాట్లాడుతూ అరకు, అనంతగిరి ప్రాంతాల పరిధిలో ప్రమాద బాధితులకు ఎస్.కోటలో ప్రథమ చికిత్స చేసి, విశాఖ తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరగా, అది తన పరిధిలో లేదని అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ అన్నారు. దాంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతగిరి, అరకు మండలాలు అల్లూరి జిల్లాల్లో లేవా?...అని నిలదీశారు. ఈ దశలో జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర జోక్యం చేసుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పనితీరు మార్చుకోవాలని పదేపదే సూచించినా ఫలితం కనిపించడం లేదన్నారు. వెంటనే రోష్ని, గంగరాజు లేచి అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సేవలు తమకు వద్దని, వెంటనే సరండర్ చేయాలని డిమాండ్ చేశారు. మునగపాక జడ్పీటీసీ సభ్యుడు పీఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి ఆస్పత్రిలో మార్చురీ వద్ద వసూళ్లు కొనసాగుతున్నాయని ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం మండలంలో పలుచోట్ల కిడ్నీ వ్యాఽధులతో ప్రజలు బాధపడుతున్నారని జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ పేర్కొనగా, ఆయా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటుచేస్తామని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హైమావతి తెలిపారు. గృహ నిర్మాణంపై జరిగిన చర్చ సందర్భంగా ఏజెన్సీలో గూడు లేని కుటుంబాల ఎంపిక కోసం మరోసారి సర్వే చేయాలని జడ్పీ చైర్‌పర్సన్ ఆదేశించారు. అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లింపు కోసం పాడేరులోని గిరిజన ఇంజనీరింగ్ విభాగంలో ఒక అధికారి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. సమావేశాల్లో సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజకుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.