Share News

గంజాయి వ్యాపారి ఆస్తులు ఫ్రీజ్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:15 PM

గంజాయి వ్యాపారం చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించిన డుంబేరి సతీశ్‌కుమార్‌కు చెందిన రూ. 34 లక్షల 93 వేల 031 విలువ గల ఆస్తిని ఫ్రీజ్‌ చేసినట్టు పాడేరు డీఎస్పీ ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌ తెలిపారు.

గంజాయి వ్యాపారి ఆస్తులు ఫ్రీజ్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ అభిషేక్‌

పాడేరు డీఎస్పీ అభిషేక్‌

అక్రమ సంపాదనపై దర్యాప్తు

అతని భవనం, ఫోర్‌వీలర్‌ జప్తు

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గంజాయి వ్యాపారం చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించిన డుంబేరి సతీశ్‌కుమార్‌కు చెందిన రూ. 34 లక్షల 93 వేల 031 విలువ గల ఆస్తిని ఫ్రీజ్‌ చేసినట్టు పాడేరు డీఎస్పీ ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌ తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని డి.గొందూరు పంచాయతీ పాల్‌మాన్‌సంక గ్రామానికి చెందిన డుంబేరి సింహాచలం కుమారుడు సతీశ్‌కుమార్‌ గంజాయి వ్యాపారం చేస్తూ గతంలో పలుమార్లు పట్టుబడ్డాడన్నారు. ఈయనపై వివిధ పోలీస్‌ స్టేషన్‌ల్లో నాలుగు కేసులు నమోదయ్యాయన్నారు. అందులో ఒక కేసు పాడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఉందన్నారు. అతడు గంజాయి వ్యాపారం చేస్తూ ఆస్తులు సంపాదించినట్టు అందిన సమాచారం మేరకు పాడేరు సీఐ డి.దీనబందు అతని ఆస్తులపై ఫైనాన్షియల్‌ ఇన్విస్టిగేషన్‌ చేపట్టారన్నారు. ఆయనకు గ్రామంలో భవన నిర్మాణంతోపాటు ఫోర్‌ వీలర్‌ను గంజాయి సంపాదనతో కొనుగోలు చేసినట్టు గుర్తించి సీజ్‌ అండ్‌ ఫ్రీజ్‌ చేస్తూ ఆర్డర్స్‌ని కాంఫిటెంట్‌ అథారిటీ చెన్నై వారికి పంపించారన్నారు. దానిని కాంఫిటెంట్‌ అథారిటీ వారు క్షుణ్ణంగా పరిశీలించి, కన్ఫర్మేషన్‌ ఆర్డర్‌ ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో అతడి ఆస్తులు బిల్డింగ్‌, ఫోర్‌ వీలర్‌ వాహనం ఫ్రీజ్‌ చేశామన్నారు. ఆ ఆస్తులను ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆయన ప్రకటించారు. గంజాయి వ్యాపారులపై గట్టి నిఘాను ఉంచామని. వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ డి.దీనబందు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:15 PM